సముద్రంలో ఈతకు వెళ్ళడం, ఇంకా ఎన్నో జల క్రీడలు ఆడటం ఎంతో మందికి సరదా. ఇక విదేశాల్లో అయితే వారాంతాల్లో సముద్రాలలో ఎంతో సరదాగా గడుపుతారు. అయితే ఒక్కోసారి ఆ సరదా విషాదంగా మారవచ్చు. కారణం సరదా కోసం మరీ నీటిలోకి వెళ్తే అక్కడి చేపలు మనకు హాని చేయవచ్చు. అలా ఎంతో మంది గాయాల పాలైయ్యారు. అందుకు కారణం మనకు నీటిలో ఏముందో తెలియకపోవడం, చూడలేకపోవటం. ఈ పరిమితిని అధిగమించి జపాన్ లోని Tsukuba University కి చెందిన Ph.D విద్యార్ధులు Aisen Carolina Chacin మరియు Takeshi Ozu ఒక కొత్త గ్లోవ్ ను తయారు చేసారు.

ఇది డాల్ఫిన్ల స్పూర్తిగా తయారు చేసారు. జపనీస్ భాషలో ఇరుక అంటే డాల్ఫిన్ అన్న మాట. ఈ గ్లోవ్ ప్రత్యేకత ఏంటంటే నీటిలో చూడలేము కాబట్టి మన చేతి మీద స్పర్శ లేదా వత్తిడి ద్వారా ఈ గ్లోవ్ నీటిలో మనo ముట్టుకోకుండానే ఏదైనా జంతువు ఎక్కడ ఉందో, ఎలా ఉందో మనకు తెలిసేలా దీనిని తయారు చేసారు. అదెలాగంటే ఈ గ్లోవ్ లో MaxBotix MB7066 అనే సోనార్ సెన్సర్, మూడు మోటార్లు అలాగే Arduino Pro Mini అనే సర్క్యూట్ ను ఉపయోగించారు. ఈ SONAR ద్వారా శబ్ద తరంగాలు నీటిలో ప్రయాణించి నీటిలోని చేపలు లేదా ఏ ఇతర వస్తువులు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాయో తెలియచేస్తుంది. అంటే దీని నుంచి వచ్చే ultrasound శబ్ద తరంగాలు నీటిలోకి ప్రయాణించి ఏదైనా జీవికి కానీ వస్తువుకు కానీ తగిలి దాని నుంచి పరావర్తనం చెంది మనకు చేరుతాయి అన్న మాట.

ఆ పైన ఈ glove లో మన చూపుడు, మధ్య మరియు ఉంగరం వేలికి మూడు మోటర్లు ఉన్నాయి. ఏదైనా వస్తువు లేదా చేప మనకు దగ్గరలో ఉన్నప్పుడు ఈ SONAR సెన్సర్ నుంచి వచ్చిన సమాచార ఇందులో అమర్చబడ్డ సర్క్యూట్ కు చేరుతుంది. అప్పుడు వేళ్ళకు ఉన్న ఈ మోటర్లు పని చేయడం మొదలు పెడతాయి. ఇవి నీటిలో ఉన్న నీటిని ఆయా వేళ్ళ వైపు వత్తిడి కలిగేలా చేస్తాయి. ఈ వత్తిడి ఏదైనా వస్తువు లేదా జీవి మన చుట్టూ ఉన్న దూరాన్ని బట్టి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. ఈ గ్లోవ్ మన చుట్టూ ఉన్న నీటిలో రెండు అడుగుల దూరం వరకూ సముద్రపు జీవిని కానీ, ఏదైనా వస్తువును కానీ గుర్తించగలదు.

ఈ పరికరం ప్రధానంగా వరదల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల ప్రమాదవసాత్తు నీట మునిగిన వారి జాడను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది.

Courtesy