కార్లలో చాలా రకాలు వచ్చేసాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లను కూడా మించిపోయి డ్రైవర్లెస్ కార్లు ఇప్పటికే కొన్ని దేశాల్లో నడుస్తున్నాయి. ఈ డ్రైవర్లెస్ కార్లు పూర్తిగా జిపిఎస్ తో నడిచేవి కావడం, అలాగే ఎలక్ట్రిక్ కార్లు కావడం కూడా విశేషం. ప్రస్తుతం ఏ దేశంలోనైనా సరే నగరాల్లో నెలకొన్న వాయు కాలుష్యం దృష్ట్యా ఈ ఎలక్ట్రిక్ కార్లు ఒక మంచి ప్రత్యామ్న్యాయం. ఉదా: చైనాలోని బీజింగ్, అలాగే మన దేశంలోని ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే కాలుష్య నివారణకు కొన్ని సంఖ్యలో కార్లను నిలిపివేస్తున్నారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అయితే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు ఉన్నా వాటికి ఛార్జింగ్ చేయాల్సి రావడం దాని ప్రధాన పరిమితి అయింది. దాంతో మిగతా కార్ల కంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నా అది వెనకపడి పోయింది.

సరే, ఇది అలా ఉంచితే ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెంచే విధంగా అమెరికా లోని Stanford Univesity కి చెందిన పరిశోధకులు ఒక కొత్త ప్రయోగం చేసారు. అదేంటంటే, ఒక కదులుతున్న LED బల్బును వైర్లెస్ గా ఛార్జ్ చేసారు. అయితే ఇందుకు కేవలం ఒక మిల్లీవాట్ కరెంట్ మాత్రమే ఖర్చు అయింది. కానీ అదే ఒక ఎలక్ట్రిక్ కార్ ను కదులుతుండగా ఛార్జ్ చేయాలి అంటే, కొన్ని వందల కిలోవాట్ ల కరెంటు వైర్లెస్ గా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎలక్ట్రిక్ కార్ల వైర్లెస్ ఛార్జింగ్ కు ఇది తోలి అడుగు మాత్రమే అంటున్నారు వీరు. భవిష్యత్తులో ఇది నిజమవుతుందని అంటున్నారు ఈ పరిశోధక బృందం.

అయితే ఇది వాస్తవ రూపం దాల్చాలంటే మన రవాణా వ్యవస్థలో దీనికి ప్రత్యేకమైన చోటు ఉండాలి. అదేంటంటే, రోడ్డు మీదే నిర్ణీత దూరంలో ఛార్జింగ్ ఉంటే, కారు డ్రైవ్ చేస్తున్నప్పుడే ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ కార్లలో ఇంటి వద్ద ఉండే ఛార్జింగ్ పోర్ట్ తో పాటు, రోడ్డు మీద ఉండే వైర్లెస్ ఛార్జింగ్ అందుకోవడం కోసం, ఈ కారు అడుగున ఒక కాయిల్ (in-built) గా తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ వీడియో లో చూపించిన విధంగా కార్ ఛార్జ్ అవుతుంది. ఇందుకు Qualcomm సంస్థ పరిశోధనలు చేస్తోంది.