నేనేదైనా పొరపాటుగా రాసాను అనుకుంటున్నారా. లేదండి నేను సరిగ్గానే రాసాను మీరు కూడా సరిగ్గానే చదివారు. ఇప్పటి దాకా మనం మంచి నీటిని కొనుక్కోవడం చూసాం కానీ మంచి గాలిని కొనుక్కోవడం ఏంటి అనుకుంటున్నారా. ఇంతకీ ఎవరు ఎక్కడ కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎందుకు, ఏమిటీ ఎలా అంటే చదవండి మరి.

వాయు కాలుష్యం. ఇది ఇప్పుడు పెను భూతం అయ్యి కూర్చుంది. పర్యావరణాన్ని పట్టించుకోకుండా చేసే మానవ తప్పిదాలకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ప్రపంచంలో అన్ని దేశాలకూ ఇందులో భాగం ఉన్నా ముందుగా ఆ కాలుష్యానికి బలి అవుతున్నది మాత్రం చైనా లోని బీజింగ్ వాసులే. ఎందుకంటే బీజింగ్ లోని వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని కూడా దాటిపోయిందని WHO లెక్కల ప్రకారం తేలింది. దీని వల్ల అక్కడి ప్రజలు చాలా ప్రమాదకరమైన జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. అంతే కాదు ఈ విషయాన్ని బీజింగ్ ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంది. బీజింగ్ ప్రభుత్వం వాయు కాలుష్యం దృష్ట్యా ఈ నగరానికి రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఎక్కువ కార్లను రోడ్ మీద వెళ్ళకుండా చర్యలు తీసుకుంటోంది. WHO లెక్కల కంటే 20 రెట్లు ఎక్కువగా గాలిలో విష పదార్ధాలు ఉండడంతో బీజింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

కెనడా లో ఒక సంస్థకు, ఒకప్పుడు సరదాగా మొదలైన వ్యాపకం, బీజింగ్ పరిస్థుతుల దృష్ట్యా ఒక పెద్ద వ్యాపారంగా మారింది. దాని ఫలితమే ఈ “Vitally Air” bottled air. ఈ సంస్థ వారు కెనడా లోని Rocky Mountains పర్వత ప్రాంతం నుంచి మంచి స్వచ్చమైన గాలిని బాటిల్ లో నిoపి విక్రయిస్తున్నారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి 97% స్వచ్చమైన ఆక్సిజన్ మరియు ఇతర వాయువులు చాలా కొద్ది మొత్తంలో కలది. రెండవది, “Fresh Clean Air” అది సాధారణoగా గాలిలో ఉండే 78% nitrogen, 21%oxygen ఇంకా ఇతర వాయువులు కలది. ఒక్కో బాటిల్ 150 నుంచి 200 సార్లు ఊపిరి తీసుకోవడానికి పనికొస్తుంది. అయితే దీనిని ఎలా వాడాలి అంటే ఒక మాస్క్ ను గొట్టానికి తగిలించి ఈ బాటిల్ కు పెట్టుకుని బీజింగ్ రోడ్ల మీద నడిచేటప్పుడు వాడతారు అన్నమాట. అయితే ఈ గాలి ద్వారా ఎలాంటి వ్యాధులూ నయం కావని ఇది కేవలం సాధారణ గాలిలాగా పీల్చడానికేనని ఈ బాటిల్ వెనుక రాసారు ఈ సంస్థ వారు. అయితే ఒక్కో 10 లీటర్ బాటిల్ ఖరీదు $22.95. అంటే మినరల్ వాటర్ బాటిల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

బీజింగ్ వాసులు ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఈ ముప్పు చాలా బాధాకరమైనది. పద్దేనిమిదేళ్ళ క్రితం KYOTO ప్రోటోకాల్, తరువాత COPENHAGEN ఇప్పుడు తాజాగా పారిస్ లో జరిగిన Climate Change summit వరకూ ప్రపంచ దేశాలు, ఇలా ఒక్కో దేశంలో చర్చలు పెట్టుకోవడమే తప్ప చేసింది పెద్దగా ఏమీ లేదు. అందుకు మన దేశమూ మినహాయింపేమీ కాదు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొని డీజిల్ కార్లకు బదులు గ్రీన్ ఫ్యూయల్స్ అలాగే భారీగా కర్బన ఉద్గారాలు (Carbon Emissions) ను విడుదల చేసే పరిశ్రమలను మూసి వేయడం వంటి చర్యలు కఠినంగా తీసుకోకపోతే ప్రాణ వాయువును కొనుక్కోవడానికే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు.

Courtesy