సాంకేతిక అభివృద్ధి వల్ల ఒకప్పుడు పెద్ద పెద్ద పరికరాలతో చేసే పనులు ఇప్పుడు చిన్న చిన్న సెన్సర్లతో చేసేస్తున్నారు. ఒకప్పుడు నిపుణులకు గానీ తెలియని విషయాలు, సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మన ఇంట్లో ఉపయోగించే ఒక స్మార్ట్ హోం అప్లికేషను – Netatmo Healthy Home Coach గురించి.

మన ఇంట్లో ఏ గదిలో ఎలా ఉంది, అందులోని గాలి సురక్షితమా కాదా, తేమ తగినంతగా ఉందా లేదా వంటి విషయాలు మనకు తెలియవు. అందువల్ల మనకు తెలియకుండా చర్మ సంబంధిత వ్యాధులు, చంటి పిల్లలకు అస్తమా వంటి జబ్బులు సైతం వస్తున్నాయి. దీనికి కారణం మరేదో కాదు, మన ఇంట్లోని గాలి. అందువల్ల మన ఇంట్లో గాలి, తేమ, ఉష్ణోగ్రత వంటి అంశాలు ఆరోగ్యకరoగా ఉందో లేదో అనే అవగాహన అందరూ కలిగి ఉండాలి. అందుకోసం ఈ చిన్న పరికరం మన ఇంటిని గమనించి మనకు సూచనలు చేస్తుంది. ఈ Netatmo వల్ల ప్రతీ క్షణం మన ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్యానికి తగ్గట్టు ఇంట్లోని గాలి ఉందా లేదా అన్నది ఇట్టే చెప్పేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం.

ఇది చూడడానికి పొడవైన సిలిండర్ ఆకారంలో ఉంటుంది. ఇది వై-ఫై ద్వారా పని చేస్తుంది. దీనిని ఒక ప్లగ్ లో కనెక్ట్ చేస్తే చాలు ఒక లైటు వెలగటo ద్వారా ఇది పని చేస్తోంది అని తెలుస్తుంది. ఇక సంబంధిత యాప్ ద్వారా మన ఫోనుకు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రతీ క్షణం ఏ గదిలో ఎలా ఉందో మనకు సూచిస్తూనే ఉంటుంది. ఆ సూచనలు పాటిస్తే ఆరోగ్యకర వాతావరణం ఉన్న ఇళ్ళు మన సొంతం. ఇది మన ఇంట్లో లేదా గదిలో నిరంతరం నాలుగు అంశాలను గమనిస్తుంటుంది. అవి – తేమ, ఉష్ణోగ్రత, శబ్ద, గాలి నాణ్యత.

ఇవన్నీ మన ఆరోగ్యం పై ప్రభావం చూపేవే. అందులోను నగరాల్లో ఉండే వారికి ఈ చివరిది మరీ ముఖ్యం. ఎందుకంటే ఇంటి బయట ఎలాగు ఉండే కాలుష్యాన్ని అరికట్టలేనప్పుడు, మన ఇంట్లోనైనా సరైన వాతావరణం ఏర్పరుచుకోవడం తప్పనిసరి కదూ.

అయితే ఈ పరికరం ఇంట్లోని ఒక్క గదిని మాత్రమే గమనించగలదు. ఇంట్లో ఉండే రెండు, మూడు, అంతకంటే ఎక్కువ గదులను గమనించాలంటే ఏ గదికాగది ప్రత్యేకంగా ఈ Netatmo ను అమర్చుకోవాల్సిందే.

ఇలాంటి హోం అప్లికేషను లు ఇప్పటికే అందుబాటులో ఉన్నా సులభంగా ఉన్న దీని వాడకం, ధర మిగతా వంటి కంటే ఈ Netatmo ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ పరికరం ప్రస్తుతం అమెరికా, యుకె లలో లభిస్తోంది. దీని ధర కేవలం $99 మాత్రమే.