ఈ వాచ్ ఏంటి క్లైమేట్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా. చెప్తా చెప్తా అక్కడికే వస్తున్నా. మనలో కాలంతో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కో ఉష్ణోగ్రతను తట్టుకుంటారు. కొంత మందికి మండు వేసవిలో ఏసి 18 డిగ్రీల కంటే ఇంకా తక్కువ ఉంటే బావుండు అనుకుంటారు. మరి కొంత మంది అదే వేసవిలో అదే గదిలో 25 కే వణికిపోతారు. ఒకే ఇంట్లో భార్యకు ఏసి చలి అనిపిస్తే, భర్తకు ఉష్ణోగ్రత చాలా సాధారణం అనిపించవచ్చు. ఇలాంటివి మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే కాలాలకు సంబంధించి మనం సౌకర్యంగా ఉండేందుకు ఏసి లేదా హీటర్ వంటి వాటి మీద ఆధార పడతాం.

ఈ ఏసి లు మొదలైనవి ఎంతో విద్యుత్తును ఖర్చు చేస్తాయి, ఆ పైన మన జేబును ఖాళీ చేస్తాయి. అయినా సరే, వీటిని మనం ఎక్కడికీ తీసుకుపోలేము కదా. అలా ఒక ట్రైన్లో ఉన్నప్పుడు మనకు వేడిగా అనిపిస్తే, అప్పటికప్పుడు మనకు ఏసి రాదు కదా. మరేం చెపాలి అంటే దానికి పరిష్కారమే ఈ Aircon Watch.

ఈ Aircon Watch ను సాధారణ వాచ్ లా పెట్టుకుని మీకు చలిగా ఉన్నప్పుడు ఇందులోని హీట్ బటన్ నొక్కితే, మీ శరీరం మీకు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతను పొందుతుంది. ఇక మీకు వేడిగా ఉంటే, మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మీకు చల్లదనాన్ని ఇస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ఎలా పని చేస్తుంది అంటే, ఈ వాచ్ స్ట్రాప్ సరిగ్గా మణికట్టు అడుగున చర్మానికి దగ్గరగా ఉండే నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది. మెదడులో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక భాగం ఉంటుంది. అదే బయట వాతావరణ మార్పులకు తగ్గట్టుగా పని చేస్తుంది. అందువల్లనే మనకు చల్లగా ఉన్నప్పుడు చలి అనిపించడం, వేసవిలో వేడిగా అనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాచ్ లో మణికట్టు అడుగున ఉన్న స్ట్రాప్ లో ఒక చిన్న పరికరం ఈ నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మెదడుకు వ్యతిరేక సంకేతాలని పంపిస్తుంది. ఈ వ్యతిరేక సంకేతాలను నాడీ మండలం ద్వారా అందుకున్న మెదడు అది అడిగినట్టు శరీర ఉష్ణోగ్రతను మార్చుతుంది.

అంటే మొత్తానికి మనం మన శరీరంలో ఉండే ఉష్ణోగ్రత నియంత్రణా వ్యవస్థను మన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నాం అన్న మాట. అందుకే మనం చలిగా ఉన్నప్పుడు మనం ఇందులో హీట్ బటన్ నొక్కడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి మనకు సౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మనం కూల్ బటన్ నొక్కితే శరీరం చల్లబడుతుంది. ఈ వాచ్ ను బయట వాతావరణం తో సంబంధం లేకుండా ఎంతటి ఎండలోనైనా, ఎంతటి చలిలోనైనా పని చేస్తుంది.

ఈ వాచ్ లో కేవలం మూడు బటన్లు ఉంటాయి. అవి ఆన్, హీట్, కూల్ అంతే. దీనిని వాడటం కూడా చాలా తేలిక. ఇక దీనిలో 400mAh బాటరీ ఉంటుంది. అంటే ఇది 4 గంటల చల్లదనం, 8 గంటల వెచ్చదనం ఇస్తుందన్న మాట. దీనిని హాంగ్కాంగ్ పరిశోధకులు రూపొందించారు. దీనిని పెట్టుకుని మీరు ఎడారిలో సౌకర్యంగా తిరగవచ్చు లేదా మంచు పర్వతాలను అంతే సౌకర్యంగా అధిరోహించనూ వచ్చు.

ఈ Aircon Watch ధర కేవలం $80 మాత్రమే. ఇది త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది.