నిద్ర ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి సమస్యగా మారుతోంది. దీనికి చాలా కారణాలు ఉన్నా ముఖ్యమైనవి వత్తిడి, జీవన శైలిలో మార్పులు. సరే, ఈ నిద్ర మీదా నిద్రా సమస్యల మీద ప్రస్తుత పరిశోధకులు చాలా పరిష్కారాలే అందుబాటులోకి తెచ్చారు. అందులో గురకను అదుపు చేసే పరికరాలు, జీవన శైలిని గమనించి మంచి నిద్ర పట్టేందుకు సూచించే పరికరాలు ఉన్నాయి. కానీ నిద్రకు అవసరమైన వస్తువుతోనే మనల్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది అమెరికాలోని షికాగోకు చెందిన ఒక సంస్థ. దాని ఫలితమే ఈ Zeeq smart pillow (తల దిండు).

అవును నిద్రకు కావాల్సిన దిండుతోనే మనల్ని నిద్రపుచ్చడం, మన నిద్రని గమనించి తగిన సూచనలు చేయడం ఇలాంటివన్నీ చేస్తుంది ఈ స్మార్ట్ Zeeq. ఈ దిండులో మూడు ఫీచర్లు ఉంటాయి. 1. చాలా మందికి నిద్ర పోయేటప్పుడు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఇది పక్కన పడుకునే వారికి ఇబ్బందిగా ఉంటుంది. దీని కోసం మార్కెట్లో గురకను ఆపేందుకు మాస్క్ వంటివి ముఖానికి తగిలించుకుని పడుకునే పరికరాలు ఉన్నాయి. కానీ అలా అదనపు ముసుగులు అవసరం లేకుండా ఈ దిండు గురక పెడుతుంటే మనల్ని కొద్దిగా తట్టి లేపడం ద్వారా మనల్ని వేరే భంగిమలో పడుకునేలా చేస్తుంది. ఆ విధంగా గురక తగ్గుతుంది. 2. చాలా మందికి పడుకునే ముందు సంగీతం వినడమంటే ఇష్టం. కానీ అది వింటూ సోఫాలో పడుకోవడమో లేదా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పడుకునే బదులు ఈ తల దిండే మీకు నచ్చిన సంగీతాన్ని మీకు వినిపిస్తుంది. ఈ దిండులో ఉండే ఎనిమిది స్పీకర్లు కేవలం ఆ దిండు మీద పడుకునే వారికి మాత్రమే వినబడేలా మీ స్మార్ట్ ఫోన్ నుండి పాటలు/సంగీతం వినిపిస్తుంది. 3. దీనిని ట్రాకర్ పిల్లో అంటారు. దీనిలో ఉండే సెన్సర్లు వ్యక్తి నిద్రను గమనించి వారికి సుఖనిద్రకు కావాల్సిన సూచనలు చేస్తుంది.

ఇంకా దీనిలో పాటలు ప్లే చేయడానికి టైమర్, అలారం ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ దిండును రెండు వారాలకు ఒకసారి రీఛార్జి చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ఇది రాత్రి పని చేయడానికి వైఫై ఉండి తీరాలి.

సరే, ఇలాంటి పాటలు పాడే దిండు $200 ఇస్తే కానీ పాడదు మరి. ప్రస్తుతం ఈ స్మార్ట్ దిండు వీరి వెబ్ సైట్ లో అమ్మకానికి ఉంది.