ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో చొక్కా గుండీల దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల దాకా మనం వాడే ప్రతీ వస్తువు ‘స్మార్ట్’ అయిపోయింది. ఇక ఆ వస్తువులలో ఇంత వరకు ఈ స్మార్ట్ వస్తువుల కోవలోకి చేరనిది బెల్ట్. ఇప్పుడు ఈ బెల్ట్ ను కూడా స్మార్ట్ వస్తువుల్లో చేర్చేసారు C-Labs సంస్థ వారు. రోజూ కార్యాలయానికి వెళ్ళేప్పుడు అందరూ పెట్టుకునే బెల్ట్ కూడా స్మార్ట్ అయిపోయి పెరిగే నడుము చుట్టుకొలతను గూర్చి మనల్ని హెచ్చరిస్తుంది. సహజంగా చాలా మందికి ఈ నడుము భాగంలోనే కొవ్వు పేరుకుని ఉంటుంది. దాంతో శరీరం మొత్తం సన్నగా ఉన్నా ఇక్కడ మాత్రం తేడాగా ఉంటుంది. ఆ కొవ్వును కరిగించడనికే చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.

పైగా అనారోగ్యం వచ్చి చేరుతుంది అనడానికి సూచనగా ఈ పెరిగే నడుము కొలతను సూచిస్తున్నారు వైద్యులు. ఈ waist size వయసుకు తగ్గట్టు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్, డయాబెటిస్, బీపి వంటివి ఉన్నట్టే. అంత ప్రాముఖ్యత ఉంది ఈ శరీర భాగానికి. అటువంటి కీలకమైన శరీర భాగంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో కనిపెట్టగలిగే ఈ ‘స్మార్ట్ బెల్ట్’ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దామా.

ఈ స్మార్ట్ బెల్ట్ పేరు ‘Welt’. దీనిని samsung వారి C-lab సంస్థ రూపొందించింది. ఇది చూడడానికి ఏ మాత్రం తేడా లేకుండా మనం రోజూ పెట్టుకునే లెదర్ బెల్ట్ లానే ఉంటుంది. కానీ దీని buckle లో ఉండే మాగ్నెటిక్ సెన్సర్స్ నడుము చుట్టూ కొలతను కొలిచి దానిని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. దానిలో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే ఈ యాప్ లో నోటిఫికేషన్ ద్వారా సూచించేస్తుంది. అంతే కాదు ఈ బెల్ట్ పెట్టుకుని మీరు ఎప్పుడైనా అతిగా తింటుంటే మీ పొట్ట దగ్గర వచ్చే మార్పును గమనించి యాప్ ద్వారా alert చేస్తుంది. శ్రద్ధ కలిగిన వారైతే అక్కడితో ఆపేయడానికి ఆస్కారం ఉంటుంది

ఇంకా ఈ బెల్ట్ రోజులో మీరు కూర్చునే సమయాన్ని, ఎంత సేపు నడిచారు (20 కంటే ఎక్కువ అడుగుల నుంచి లెక్క పెడుతుంది) అన్నది గమనించి ఏ రోజుకారోజు యాప్ లో తెలియచేస్తుంది. ఈ స్మార్ట్ బెల్ట్ ను ఈ ఏడాది CES 2018 లో విడుదల చేసారు. ఈ బెల్ట్ ను microUSB ద్వారా ఒక్క గంటలో ఛార్జ్ చేసేయచ్చు. అలా ఒక్క ఛార్జ్ 20 రోజుల పాటు పని చేస్తుంది. ఇక ఈ బెల్ట్ లో మూడు రకాలు ఉన్నాయి – ఫార్మల్, casual, women. ఈ బెల్ట్ ధర $149 నుండి $199 వరకు ఉంటుంది. ఇంకేం మన అందానికి కారణమైన నడుము కొలతను బహుశా ఈ బెల్ట్ కంటే ఎక్కువగా ఎవరూ గమనించలేరేమో కదూ.