మన నిత్య జీవితoలో పెరుగుతున్న పని ఒత్తిడి వల్ల ఒక్కోసారి మనం రెండు మూడు పనులను ఒకేసారి చేయాల్సి ఉంటుంది. దానినే మల్టీటాస్కింగ్ అంటారు. అయితే దీనిలో కొందరు సమర్ధులు అయితే మరి కొంత మందికి అంత సమర్ధత ఉండదు. అలాంటప్పుడు మనకు మరో పది చేతులు ఉంటే బాగుండును అని అనిపిస్తుంది కదూ. పది కాకపోయినా కనీసం మరో రెండైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పరిశోధకులు. సహజంగా అది కుదరకపోయినా MetaLimbs ద్వారా అది సాధ్యం అంటున్నారు జపాన్ కు చెందిన పరిశోధకులు.

University of Tokyo మరియు Keio University కి చెందిన పరిశోధకులు చేతికి తగిలించుకునే రెండు కృత్రిమ రోబోటిక్ చేతులను తయారు చేసారు. టోక్యో లోని Inami Hiyama Laboratory లో దీనిని రూపొందించారు. వీటిని తగిలించుకుంటే మన చేతుల లానే మనకు అన్ని పనులూ చేసి పెడతాయి. దీనిని ఎలా నియంత్రించాలి అంటే కుడి రోబోటిక్ చేతికి కుడి కాలి ద్వారా, ఎడమ రోబోటిక్ చేతికి ఎడమ కాలికి ఉండే సెన్సార్ల ద్వారా ఈ అదనపు చేతులను నియంత్రించవచ్చు. మన కాలు, పాదము, కాలి వేళ్ళ ద్వారా వీటి నియంత్రణ సాధ్యం. ఇక్కడితో ఆగి పోలేదు, కొన్ని రకాల వృత్తి పనులు చేసేందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఈ చేతులను తీసేసి వేరే రోబోటిక్ టూల్స్ ను అమర్చుకోవచ్చు. మొదట్లో ఈ రోబోటిక్ చేతులను వ్యక్తి కూర్చున్నప్పుడు (కాలిని, పాదాన్ని కదపవచ్చు కాబట్టి) ఉపయోగించే విధంగా తయారు చేసారు. కానీ ఆ పైన నుంచుని చేసే పనులకు కూడా ఉపయోగపడేందుకు కాలి వేళ్ళ నియంత్రణ ఏర్పాటు చేసారు.

ఈ రోబోటిక్ చేతులను మన కాళ్ళ ద్వారా ఎలా నియంత్రించవచ్చో ఇక్కడ వీడియో లో చూడవచ్చు. ఇది ప్రస్తుతానికి proof of concept మాత్రమే. ఇంకా దీనిని అభివృద్ధి చేయాల్సి ఉంది అంటున్నారు ఈ బృందానికి నేతృత్వం వహించిన Tomoya Sasaki.

ఈ MetaLimbs అందుబాటులోకి వస్తే, దీనికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది అంటున్నారు Sasaki. సహజమే కదా, ప్రకృతి విరుద్ధంగా మనం కొన్ని తయారు చేసుకుంటే వాటికి అలవాటు పడటానికి సమయం పడుతుంది అనడంలో సందేహం లేదు. వీటితో ఎలాంటి పనులు చేయాలో చెప్పేకంటే ఎవరికి వారు ఊహించుకుoటే బావుంటుందేమో కదూ.