ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థ అంతా ఎలక్ట్రానిక్స్ చుట్టూ తిరుగుతోంది అనడంలో సందేహం లేదు. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, బ్లూ టూత్ ఇలా ఏ సమాచారం అయినా వైర్లెస్ గా చేరవేయబడుతోంది. ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల వల్ల సాధ్య పడుతోంది. దీనిని మించి మరో పద్ధతిలో కూడా సమాచార మార్పిడి చేయవచ్చు అంటున్నారు Stanford University పరిశోధకులు.

Stanford University కి చెందిన ప్రొఫెసర్ అఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయిన Andrea Goldsmith ఒక కొత్త పద్ధతిలో ఒక కొత్త పరికరం ద్వారా రసాయనాలతో సమాచార మార్పిడి చేయవచ్చని రుజువు చేసారు. వారి ప్రయోగంలో భాగంగా – వారు మూడు రకాల రసాయనాలు, మైక్రో కంట్రోలర్, pH మీటర్, ఒక ఎలక్ట్రానిక్ డిస్ప్లే, మరియు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను ఉపయోగించారు.

ఇది ఎలా పని చేస్తుంది అంటే ఈ రసాయనాలను వాటి వాటి బాటిల్స్ నుంచి ఒక మైక్రో కంట్రోలర్ ద్వారా నియంత్రించబడి ఒక ప్రత్యేకమైన మాధ్యమం ద్వారా pH మీటర్ కు చేరుకుంటాయి. ఇక్కడ సమాచారాన్ని కంప్యూటర్ మాదిరిగానే బిట్స్ లోకి (0, 1) విభజిస్తే ఆ సమాచారం యొక్క సీక్వెన్స్ ను బట్టి ఆమ్లము మరియు క్షారము ఉపయోగించబడతాయి. ఈ pH మీటర్ లోని ఈ సీక్వెన్స్ కంప్యూటర్ లోని సాఫ్ట్వేర్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ గా రూపాంతరం చెంది ఎలక్ట్రానిక్ డిస్ప్లే లో కనిపిస్తుంది. అయితే ఈ పద్ధతి తోలి దశలో ఉందని దీనిని మరింత మెరుగు పరచాల్సి ఉందనీ Andrea అంటున్నారు.

దీని వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వైర్లెస్ సిగ్నల్స్ చేరలేని చోట ఈ విధంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేనా బయో సెన్సర్స్ లో, సైనిక రహస్యాలను పంపేందుకు ఈ పద్ధతిని వినియోగించుకోవచ్చు.