Earthquake (భూకంపం). ఈ మాట వింటేనే కొన్ని దేశాలు కంపిస్తాయి. ఎందుకంటే భూకంపాల ఫలితంగా జరిగే భీభత్సం అంతా ఇంతా కాదు. నేపాల్, జపాన్, చిలి మొదలైన దేశాలు ఈ భూకంప బాధితులే. రిక్టర్ స్కేల్ మీద నమోదైన అంకెను బట్టి తీవ్రతను, నష్టాన్ని అంచనా వేయవచ్చు. ఎన్నో ఇళ్ళు కూలిపోతాయి. వాటి శిధిలాల కింద ఎంతో మంది చిక్కుకొని పోతారు. భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఇక మళ్ళి కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. ఈ భూకంపాల నుంచి రక్షణ కోసం చాలా పరిశోధనలే జరుగుతున్నాయి. అందులో కొన్ని కొత్తగా కట్టబోయే అంతస్తులకు పనికొస్తాయి కాని, ఇప్పటికే నిర్మించి ఉన్న నిర్మాణాలను కాపాడలేవు.

ఈ నేపధ్యంలో University of Brighton కు చెందిన పరిశోధకులు ఒక విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞ్యనం సహాయంతో ఒక పరికరాన్ని తయారు చేసారు. అదే ViBa (Vibration Barrier). పేరుకు తగ్గట్టే ఇది భూమి కంపించినప్పుడు ఉత్పన్నమయ్యే తరంగాలను భవనానికి చేరకుండా అడ్డుకుంటుంది. ఈ పరికరం ఎలా వుంటుంది అంటే – ఒక పెట్టెలో ఒక రాయి వంటి దానిని స్ప్రింగుల చేత వేలాడబడి వుంటుంది. ఇది భూమి కంపించినప్పుడు ముందుకి వెనక్కి ఊగుతూ వచ్చే తరంగాలను తనలోకి ఇముడ్చుకొని ఆ తరంగాల శక్తిని భవనానికి చేరేసరికి 40 నుంచి 80 శాతం మేర తగ్గిస్తుంది. ఫలితం తక్కువ ప్రాణ నష్టం, తక్కువ ఆస్తి నష్టం. దీనిని భూమిలో పునాదుల దగ్గర పాతి పెట్టాలి. ఇది భవనం యొక్క ఇంచుమించు బరువులో 50 శాతం మేర ఈ పరికరం యొక్క బరువు నిర్ణయింప బడుతుంది. ఇలా ఒక్కో ఊళ్ళో వరుసగా కొన్ని ViBa లను పాతి పెడితే అవి భూకంప తీవ్రతను చాలా మేరకు అడ్డుకుంటాయని పరిశోధనలో తేలింది. అయితే దీనిని స్వయంగా భూకంప సమయంలో పరీక్షించి చూడాల్సి వుంది. అప్పుడు దీనికి మరింత మెరుగులు దిద్ది, మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు వున్నాయి.

ఇది సత్ఫలితాలను ఇస్తే ప్రకృతి వైపరిత్యాలైన భూకంపాలకు మానవ మేధస్సు సవాలు విసిరినట్టే.

Courtesy