ఎలక్ట్రానిక్స్, తెల్లారి లేస్తే మనకు పని ఉండేది వీటి తోనే కదూ. టీవి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ హోం అప్లికేషన్స్ ఇలా ఎన్నో విధాలుగా ఎలక్ట్రానిక్స్ ను వినియోగిస్తున్నాము. వీటన్నిటిలో కాలక్రమేణా మార్పులు వచ్చాయి కానీ ఇంకా మనం పాత కాలం నాటి మైకులు, లౌడ్ స్పీకర్లు వినియోగిస్తున్నాం. వాటిలో ఏ మార్పూ లేదు. వాటిని వాడాలంటే, వాటికి తగ్గ స్థలం, వైరింగ్, దానికయ్యే విద్యుత్తూ అన్నీ ప్రత్యేకంగా అమర్చుకోవాల్సిందే.

కానీ ఊహించండి, ఒక లౌడ్ స్పీకర్ ను, అలాగే ఒక మైక్ ను కూడా మడతపెట్టి జేబులో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. అదెలా కుదురుతుంది అనుకుంటున్నారా, ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఫోల్డబుల్ ఎలక్ట్రానిక్స్ పై విశేషమైన పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా Michigan State University కు చెందిన electrical and computer engineering కు ప్రొ. Nelson Sepulveda ఒక సన్నని పేపర్ (FENG) వంటి పరికరాన్ని లౌడ్ స్పీకర్ లాగా మార్చేసారు. అదెలాగో చూద్దాం.

Nelson, 2016 లో కీబోర్డు, LED లైట్లను, LCD టచ్ స్క్రీన్ లను సంప్రదాయ ఎలక్ట్రానిక్ పరికరాలకు బదులుగా వారు తయారు చేసిన ferroelectret nanogenerator (సన్నని పేపర్ వంటి పరికరం) సహాయంతో ఉపయోగించి పని చేసేలా చేయవచ్చని చూపించారు. ఇందులో కీలమైనది ఈ FENG. ఈ పేపర్ వంటి పరికరాన్ని ఎలా తయారు చేస్తారు అంటే, నానోటెక్నాలజీ సహాయంతో silicone wafer కు silver, polyimide మరియు polypropylene ferroelectret వంటి కొన్ని పొరలు తాపడం చేయగా ఈ FENG తయారవుతుంది. దీనిలోని అణువులు విద్యుత్ ను ఉత్పత్తి చేయగలవు. అలా కేవలం మన స్పర్శతో విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు, అలాగే ఈ FENG మైక్రోఫోన్ లా కూడా పని చేస్తుంది. అది ఎలాగంటే, ఈ FENG మన గొంతు నుండి వచ్చే శబ్ద తరంగాలను గుర్తు పట్టగలదు. అలా దీనిని మన కంప్యూటర్ కు ఒక lock లాగా కూడా ఉపయోగించవచ్చు. అంటే ఇది మానవ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది అదే విధంగా విద్యుత్ శక్తిని మానవ శక్తిగా (లౌడ్ స్పీకర్) మారుస్తుంది. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న లౌడ్ స్పీకర్ విషయానికి వద్దాం.

Nelson, ఈ FENG ని ఒక పతాకం (Flag) లో వేసి కుట్టారు. ఆ తరువాత ఒక ఐపాడ్ ను ఒక amplifier కు కనెక్ట్ చేసి దానిని ఈ పతాకానికి కనెక్ట్ చేసారు. అప్పుడు ఐపాడ్ లోని పాటలు అందరికీ వినిపించేట్టు ఒక లౌడ్ స్పీకర్ లాగా వినిపించాయి.

దీనితో చాలా ఉపయోగాలున్నాయని, అసలు ఎలక్ట్రానిక్ రంగంలోనే ఇది ఒక విప్లవమనీ Nelson అన్నారు. దీనితో భవిష్యత్తులో వార్తలు లౌడ్ స్పీకర్లో తనంతట తానూ చదవగలిగే న్యూస్ పేపర్లను తయారు చేయవచ్చు అంటున్నారు Nelson.
అతి తక్కువ విద్యుత్తు తో, తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి హాని చేయని విధంగా తయారయ్యే ఈ FENG ల తో ఎలక్ట్రానిక్ పరికరాలు మరింత చిన్నవి అయిపోతాయని, అలాగే ప్రస్తుతం మనం ఊహించనటువంటి ప్రయోజనాలు చేకూరతాయని Nelson అంటున్నారు.

ఈ పరిశోధన మే 16 నాటి Nature Communications జర్నల్ లో ప్రచురించబడింది.

Courtesy