ప్రస్తుత కాలంలో డయాబెటిస్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న జబ్బు. ఈ జబ్బుకు ఏ దేశమూ మినహాయింపు కాదు యావత్ ప్రపంచం ఈ వ్యాధి గురించి భయపడుతోంది. డయాబెటిస్ ఉన్న వారిని పక్కన పెడితే ఏటా ప్రీ-డయాబెటిస్ వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీనిని పెను వైద్య విపత్తుగా వైద్యులు భావిస్తున్నారు. దీని పై జరుగుతున్న పరిశోధనలు మరి దేని మీద జరగడం లేదంటే అతిసయోక్తి కాదు. ఈ వ్యాధి వల్ల శరీరంలో మిగతా అవయవాలు కూడా దెబ్బ తింటాయి. అంతెందుకు గాంగ్రీన్ వంటివి ఈ డయాబెటిస్ వల్లే వస్తాయి.

శరీరంలో ముఖ్యంగా కాళ్ళకు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే (డయాబెటిస్ ఉన్న వారికి) దానిని సరిగా పట్టించుకోకపోతే, అది ముదిరి ఏకంగా కాలి వేళ్ళు/ కాలు తీసేసెంత వరకు పరిణమిస్తుంది. అయితే ఏ గాయం ఎంత మేరకు ఉపేక్షించవచ్చో కూడా మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో డయాబెటిస్ ఉన్న వారికి ఉపయుక్తంగా ఉండేందుకు రూపొందించబడినదే ఈ Smart Socks.

Siren Smart socks look

Siren Smart socks look

Siren అనే అమెరికన్ హెల్త్ టెక్ సంస్థ ఈ స్మార్ట్ సాక్స్ లను రూపొందించింది. ఈ సాక్స్ చూడడానికి మన సాధారణ సాక్స్ మాదిరే ఉంటాయి. కానీ ఈ సాక్స్ బట్టలో మైక్రోసెన్సర్స్ తో కలిపి అల్లారు. ఈ సెన్సర్స్ నిరంతరం మన ఒంటి/కాళ్ళ ఉష్ణోగ్రతను గమనిస్తూ ఉంటాయి. ఆ ఉష్ణోగ్రత లో మార్పు ఉంటే కాలికి ఎదో గాయం అయినట్టు. వెంటనే అది మన ఫోన్ కు బ్లూటూత్ ద్వారా నోటిఫికేషన్ పంపిస్తుంది. అయితే ఈ మాత్రం కనిపెట్ట లేమా అని అనుకోకండి, డయాబెటిస్ ఉన్న వారికి గాయం అయినా, ఆ వ్యాధి లక్షణం వల్ల నొప్పి తెలియదు కానీ శరీరంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తీరా గాయం ముదిరాక వైద్యుల వద్దకు వెళితే కూడా వారు చేయగలిగిందేమీ ఉండదు. ఇది ప్రత్యక్షంగా డయాబెటిస్ ఎక్కువగా ఉండే వారికి అనుభవమే అయి ఉంటుంది. సరిగా ఈ నష్టాన్ని నివారిస్తుంది ఈ స్మార్ట్ సాక్స్. ఈ స్మార్ట్ సాక్స్ కేవలం $19.95 కే లభిస్తున్నాయి. దీనిని 100 మార్లు వరకు వాషింగ్ మెషిన్ లో వేసి ఉతకచ్చు. ఆ పైన కొత్తవి కొనుక్కోవాల్సి ఉంటుంది. సరే, ఈ సాక్స్ ను Siren సంస్థ అమెరికాలోని పేద వారిని ఉద్దేశించి ప్రధానంగా తయారు చేసింది. ఎందుకంటే అక్కడ పేద వారే ఎక్కువగా డయాబెటిస్ వల్ల కాళ్ళు, కాలి వేళ్ళు (amputation) కోల్పోతుంటారు.

ఇటువంటి సాక్స్ ను మన దేశంలో కూడా కొద్ది మార్పులతో తయారు చేస్తే మధ్య, దిగువ మధ్య తరగతి వారికి ఉపయోగకరంగా ఉంటుంది.