కొన్ని కోట్ల సంవత్సరాలుగా మానవుడు తినే ఆహారం రావాలoటే అది భూమి నుంచే రావాలి. భూమిని దున్ని విత్తనాలు వేసి, దాన్ని సాగు చేసి, సరైన సమయానికి సరైన ఎండ, నీరు తగిలితేనే కొంత కాలానికి పంట చేతికి వస్తుంది. ఇదంతా ఒకప్పటి పద్ధతి ఇప్పుడు వ్యవసాయానికి భూమి కరువైపోతున్న రోజుల్లోకి మనం వచ్చేసాం. దాంతో కొత్త రకం పద్ధతుల్లో ఆహారం పండించే ప్రయత్నాల్లో ఉన్నారు ఆహార నిపుణులు. అలా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు చెందిన ఒక సంస్థ ఏకంగా భూమి కాదు షిప్పింగ్ కంటైనర్లలో పంటలను పండిస్తోంది.

Local Roots అనే సంస్థ ఎందుకూ పనికి రాని షిప్పింగ్ కంటైనర్లను ఉపయోగించి దానిలో ఆకు కూరలు ఇంకా పలు రకాల పంటలను 365 రోజులూ పండించవచ్చని అంటోంది. దీనికి ఈ సంస్థ TerraFarms అని నామకరణం చేసింది. దీనినే Hydroponic farm అని కూడా అంటారు. అంటే, భూమికి ప్రత్యామ్న్యాయంగా మరో చోట మొక్కకు కావాల్సిన పోషకాలతో కృత్రిమమైన వాతావరణంలో పెంచడం అన్న మాట. ఒక్కో షిప్పింగ్ కంటైనర్లో ఇంచుమించు భూమి మీద 5-6 ఎకరాల పంటకు సమానమైన పంటను పండిస్తోంది. అంతే కాదు ఈ పద్ధతిలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతి కంటే 97% తక్కువ నీరు అవసరం అవుతుందట. అంటే, ఎంత నీటిని ఆదా చేస్తున్నారో కదా. ఇక ఈ షిప్పింగ్ కంటైనర్ లో పోషకాలతో కూడిన నీటిని మొక్కలకు అందించడం ద్వారా అది భూమికి ప్రత్యామ్న్యాయంగా పని చేసి పంటను పండిస్తున్నారు. ఇక అందులో గాలి, వెలుతురును కూడా నియంత్రిస్తూ ఉండటం వల్ల, ఒక్కో కంటైనర్లో ఒక్కో భిన్నమైన పంటకు కావాల్సిన విధంగా ఎండను, గాలిని వదులుతారన్న మాట.

అన్నిటికీ మించి ఈ పద్ధతిలో పూర్తిగా ఎలాంటి రసాయనాలు లేని ఆర్గానిక్ ఫుడ్ మనకు లభిస్తుందట. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో ఉపయోగించే ఎలాంటి ఎరువులు ఈ TerraFarms లో వాడరు. ఇక Local Roots సంస్థ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, వినియోగదారుల దగ్గరే పంట పండించి వారికి తాజా, ఎరువులు లేని ఆర్గానిక్ ఫుడ్ అందించడం. ఒక్క అమెరికాలోనే పంట పండిన చోటు నుండి వినియోగదారుడికి చేరడానికి ఆ ఆహారం/పంట 1800 మైళ్ళు ప్రయాణిస్తుంది. ఇలా ఆహార ఉత్పత్తి-పంపిణీ క్రమంలో (Food Distribution Chain) ఆహారాన్ని ఎక్కడో పండించి, మరెక్కడికో తీసుకెళ్ళి అక్కడ నుంచి వినియోగదారులకు చేరే వరకు దానిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో దానిని రసాయనాలతో పూస్తారు, ఇంకా చాలా చాలా చేస్తారు. అలా కాకుండా నేరుగా ఒక చిన్న ఊరుని ఎంచుకుని అక్కడే పంటను పండిస్తే Food Chain చాలా మెట్లు అధిగమించి చివరికి వినియోగదారుడికి కల్తీ లేని స్వచ్చమైన ఆహరం అందుతుందన్న మాట.

నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఈ సంస్థ రానున్న 10 ఏళ్ళల్లో 100 కోట్ల మందికి ఆహారం అందిస్తామని అంటోంది. కొసమెరుపేంటంటే ఈ సంస్థ వ్యవసాయ పద్ధతులు చూసిన SpaceX సంస్థ CEO Elon Musk ఈ సంస్థకు వారి mission మార్స్ గ్రహం పై పంటలను పండించే కాంట్రాక్టును ఇచ్చింది.

Courtesy