దేశంలోని ఐఐటీ(IIT) ల్లో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను(results) నిన్న(ఆదివారం) విడుదల చేశారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలుకు చెందిన వావిలాల చిద్విలా్‌సరెడ్డి 360 మార్కులకుగాను 341 మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు (All India First rank) ను సాధించారు .. బాలికల విభాగంలో తొలి ర్యాంకును ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌కే చెందిన నాయకంటి నాగ భవ్యశ్రీ (298 మార్కులు) దక్కించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుజిల్లా పాతపాళ్యం పంచాయతీ వేణుగోపాలపురానికి చెందిన రమేశ్‌ సూర్యతేజ 338 మార్కులతో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీ(Open Category) లో రెండో ర్యాంక్‌ సాధించాడు.అలాగే.. అడ్డగడ వెంకట శివరామ్‌ (5వ ర్యాంకు) అభినవ్‌ చౌదరి (7), నాగిరెడ్డి బాలాజీ (9), వెంకట మణీందర్‌రెడ్డి (10) టాప్‌ టెన్‌ (Top ten)జాబితాలో నిలిచారు.

వీరిలో జాతీయస్థాయిలో 10వ ర్యాంకు సాధించిన మణీందర్‌ రెడ్డి జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఫస్ట్‌ ర్యాంకర్‌ కాగా, ఓబీసీ (నాన్‌ క్రీమీలేయర్‌) కేటగిరీలో ఫస్ట్‌ ర్యాంకును ఏపీలోని మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన దాసరి సాకేత్‌ నాయు డు సాధించాడు.
ఓబీసీ-పీడబ్ల్యూడీ (OBC-PWD) కోటాలో జాతీయస్థాయి రెండో ర్యాంకును చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన బి.శశాంక్‌ కైవసం చేసుకున్నారు. ఇక.. ఎస్టీ (ST) కేటగిరీలో ఫస్ట్‌ ర్యాంకు సాధించిన ధీరావత్‌ తనుజ్‌, జనరల్‌-ఈడబ్ల్యూ ఏస్ – (general ews category ) కోటాలో అగ్రస్థానంలో నిలిచిన ఆశిష్‌ కుమార్‌.. ఇద్దరూ హైదరాబాద్‌ జోన్‌కు చెందినవారే.

అంతేనా.. హైదరాబాద్‌ జోన్‌ నుంచి మొత్తం 10,432 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌లో ఉత్తీర్ణతను సాధించడం విశేషం. టాప్‌-500 జాబితాలో ఉన్నవారిలో 174 మంది హైదరాబాద్‌ జోన్‌ వారు కాగా.. 120 మంది ఢిల్లీ జోన్‌, 103 మంది బాంబే జోన్‌కు చెందినవారు. అంతే కాకుండా 13 మంది విదేశీ విద్యార్థులు (Foreign student), 155 మంది ‘ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా’ విద్యార్థులు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం విశేషం.

గురుకుల విద్యార్థుల సత్తా హవా

ఐఐటీ-జేఈఈ ఫలితాల్లో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల (SC,ST)విద్యార్థులు సత్తా చాటారు. ఎస్టీ గురుకులాల్లో 96 మందికి పూర్తిస్థాయి సీట్లు దక్కనుండగా.. మరో 118 మందికి సీట్లు దక్కే అవకాశం ఉంది. గురుకులంలో ఎస్సీ 85 మందికి పూర్తిస్థాయిలో సీట్లు దక్కనుండగా, మరో 118 మందికి కూడా అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తమకు ఉత్తమ శిక్షణ అందేలా చేసిన మంత్రులు సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

నేటి నుంచి ప్రవేశాలు..

షెడ్యూలు ప్రకారం ఐఐటీ సీట్ల భర్తీ ప్రక్రియ నేడు సోమవారం జూన్ 19వ (June19th) తేదీన ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ (Online registration) ను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 24లోపు రిజిస్ట్రేషన్లతో పాటు, సీట్లకు సంబంధించిన ఆప్షన్ల నమోదు పూర్తిచేయాలి. 29వ తేదీ వరకూ సీట్ల ఆప్షన్లను మా ర్చుకునే అవకాశం ఉంది. 30నతొలిదశ సీట్లు కేటాయించనున్నారు. జూలై 6 నుంచి రెండోదశ, జూలై 12న మూడోదశ, 16న నాలుగోదశ, 21న ఐదో దశ, జూలై 26న ఆరోదశ సీట్ల కేటాయింపు చేయనున్నారు. జూలై 28న తుది దశ సీట్లను కేటాయిస్తారు.

ప్రతిభ చాటిన పేదింటి బిడ్డలు

రాయదుర్గం,రాజేంద్రనగర్‌ లో ఒకరు కార్‌ డ్రైవర్‌ (Driver)కుమారుడు! మరొకరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడుపుకొనే దంపతుల కుమారుడు ఇంకొకరు!

ఇలా అంతా పేదింటి బిడ్డలే. అయితేనేం.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు గర్వకారణం గా నిలిచిన వీరంతా రత్నమాణిక్యాలు. హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 80 మంది విద్యార్థులు హజరుకాగా,వారిలో 35 మంది డైరెక్ట్‌ ఐటీ ర్యాంకులు (Direct IT ranks) సాధించారు. మరో 12 మంది ప్రిపరేటరీ ర్యాంకు సాధించారని గౌలిదొడ్డి ఐఐటీ మెడిసిన్‌ బాలుర సెంటర్‌ ప్రిన్సిపాల్‌ పాపారావు తెలిపారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఎస్సీ కేటగిరీలో బి.సాత్విక్‌ 53వ ర్యాంకు, బీసీ కేటగిరీలో 447వ ర్యాంకు రామకృష్ణ , ఎస్టీ కేటగిరీలో కె.పృథ్వీరాజ్‌ 225 ర్యాంకు, పి.లోకేశ్‌ 1524వ ర్యాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. అలాగే.. గిరిజన గురుకుల విద్యాలయం సొసైటీ (Society)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హయత్‌నగర్‌ గిరిజన గురుకుల కళాశాల విద్యార్థులు కూడా ఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన గోగుల నిత్యశ్రీ 182వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి రాజన్న హోంగార్డుగా పనిచేస్తున్నారు. అలాగే.. మంచిర్యాలకు చెందిన రైతు మల్లయ్య, కిష్టక్క దంపతుల కుమారుడు మన్నెపల్లి రవికుమార్‌ ఆల్ ఇండియా 164వ ర్యాంకు సాధించాడు. అటు రాజేంద్రనగర్‌ గిరిజన బాలుర ఐఐటీ స్టడీ సెంటర్‌ విద్యార్థుల్లో 66 మందికిగాను 51 మంది ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో సీట్లు పొందే అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ గట్లు సురేందర్‌ తెలిపారు. తమవద్ద చదువుకున్నవారిలో జె.సాయిచరణ్‌కు 30వ ర్యాంక్‌ రాగా.. తరుణ్‌ (126), బి.నవీన్‌ (138), ఎ.శ్రావణ్‌కుమార్‌ (161), కె.ఉపేందర్‌ (192), సందీప్‌ (194), లోకేశ్‌ (269), గణేశ్‌ (276) ఇలా మంచి ర్యాంకులు సాధించారని వెల్లడించారు. భూక్యా దేవరాజ్‌, పీడబ్ల్యూడీ విభాగంలో ఆల్ ఇండియా 5వ ర్యాంకు (All India 5th Rank)సాధించినట్లు తెలిపారు.

సోషల్‌ మీడియాకు దూరం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయస్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు సాధించిన చిద్విలాస్‌ రెడ్డి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. తండ్రి వావిలాల రాజేశ్వర్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో, తల్లి నాగలక్ష్మి ఇర్విన్‌ ప్రైమరీ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. వీరి స్వగ్రామం కర్నూలు జిల్లా బల్మూర్‌ మండలం గోదల్‌ గ్రమం.

ప్రస్తుతానికి హైదరాబాద్‌ శివార్లలోని హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు. తమ కుమారుడికి ఫస్ట్‌ ర్యాంకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యం తనకు చిన్నప్పటి నుంచీ ఉందని చిద్విలాస్‌ రెడ్డి తెలిపాడు. ‘‘అందుకే తొమ్మిదో తరగతి నుంచే మ్యాథ్స్‌, ఫిజిక్స్‌,కెమిస్ట్రీ (Maths,Physics, Chemistry)పై దృష్టి సారించాను. ప్రతి సబ్జెక్టుపై గ్రిప్‌ పెంచుకున్నాను. రోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేచేవాడిని రాత్రి 11 గంటల దాకా చదువుకునేవాడిని. సోషల్‌ మీడియా (Social Media) ను పూర్తిగా పక్కకు పెట్టేశాను.

ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతోపాటు దానికి తగ్గట్టు సాకారం చేసుకునే పట్టుదల ఉంటే ఎవరైనా సాధించవచ్చు అని మన తెలుగు విద్యార్థులు సాధించి చూపించారు.