తాగుడు. క్షమించండి, డ్రింకింగ్ అంటే మరింత బావుంటుందేమో కదూ. సరే, పేరు ఏదైతేనే ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అలవాటు. శ్రుతి మించితే వ్యసనం. దీని కారణాలు, దుష్ప్రయోజనాలు పక్కన పెడితే ఈ మద్యం మత్తు – ఆ వ్యక్తికీ, సమాజానికీ కూడా చేటు చేస్తోంది. మద్యం మత్తులో వాహనం నడిపి వారి ప్రాణాలు, పక్క వారి ప్రాణాలు పోయిన సందర్భాలు కోకొల్లలు. ఇటువంటి వార్తలు వినగానే నెపాన్ని రక్షక భటుల మీదకో, ప్రభుత్వం మీదకో లేదా మరెవరి మీదనైనా నెట్టేస్తుంటాం. కానీ వ్యక్తిగత క్రమశిక్షణ లేకుంటే ఎన్ని చట్టాలు చేసినా ఎంత మంది కాపలా కాసినా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది.

ఇటువంటి ప్రమాదాలకు కారణం అవుతున్న వారిలో ఎక్కువ శాతం చదువుకున్న వారే ఉండడం గమనార్హం. మద్యం మత్తును తక్కువగా అంచనా వేసి, తాగిన తరువాత వాహనం నడపడం ఎన్నో ప్రమాదాలకు దారి తీస్తోంది. సల్మాన్ ఖాన్, తాజాగా నందమూరి కుటుంబంలోని ఉదంతాలే ఇందుకు ఉదాహరణ. ఇటువంటివి నివారించడానికే అందుబాటు లోకి వచ్చింది Alcohoot అనే ఒక పరికరం. రండి, ఇది మందు బాబులను ఎలా నియంత్రిస్తుందో చూద్దాం.

Alcohoot - a breath analyzer

ఈ Alcohoot, ఒక breath analyser. అంటే ఇది తాగి ఉన్న వ్యక్తి ఊపిరి ద్వారా ఆ వ్యక్తి రక్తం లోని BAC (Blood Alcohol Concentration) ను లెక్క కడుతుంది. ఈ పరికరం స్మార్ట్ ఫోనులోని యాప్ కు అనుసంధానమై పని చేస్తుంది. ఇది మన అరచేతులో పట్టేటంత చిన్న పరికరం. దీనిని మన ఫోన్ లోని హెడ్ ఫోన్ జాక్ కు కనెక్ట్ చేయగానే, ఫోన్ లోని ఈ యాప్ ఈ పరికరాన్ని గుర్తిస్తుంది. అలా గుర్తించిన వెంటనే ఈ పరికరంలోని గొట్టం లోకి ఊదగానే, సెకండ్లలో ఆ వ్యక్తి రక్తం లోని BAC ను చూపిస్తుంది. అంతే కాదు ఇది ఉపయోగించిన ప్రతీ సారి ఆ సమాచారాన్ని విశ్లేషించి తగిన సూచనలను ఇస్తుంది. అంతే కాదు, ఇది ఒక వ్యక్తి లోని BAC ఎక్కువ మోతాదు లో ఉంటే, ఒక కాల్ టాక్సీ ని సైతం అతను ఉన్న చోటుకి బుక్ చేస్తుంది. ఈ Alcohoot ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. దీని ధర $99.

Alcohoot - a breath analyzerAlcohoot - a breath analyzer

ఈ పరికరం వల్ల వ్యక్తి ఎంత వరకూ మద్యం తనకు సురక్షితమో దీని వల్ల తెలుసుకోవచ్చు. దీని సూచనల ప్రకారం నడచుకోగలిగితే ఈ అలవాటు వల్ల ఆ వ్యక్తి, ఆ వ్యక్తి తో పాటు సమాజమూ సురక్షితంగా ఉంటుంది. ఇటువంటి పరికరాలు మన దేశంలోనూ విడుదల కావాలి. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇటువంటి పరికరాలు అందుబాటులో ఉన్నా ఈ మద్యం అలవాటు ఉన్న వారు వాటిని ఉపయోగించకపోతే, అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.

Courtesy