ప్రస్తుతం చలి ఎంత ఎక్కువ ఉన్నా పగలు ఎండ అలాగే ఉంది. ఇక రాబోయేది ఎండా కాలం. ఇప్పుడే ఇలా ఉంటే మరి అప్పుడెలా ఉంటుందో అన్న భయం అందరికీ ఉంది. సరే ఆ కాలం ఎవరికి తగిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. AC లకు కూలర్లకు పని చెబుతారు. అంతకు మించి అంతే ముఖ్యంగా అందరూ నూలు అదే కాటన్ దుస్తులనే ధరించడానికి ప్రయత్నిస్తారు. కారణం మనందరికీ తెలుసు.

ఒక్క అమెరికా లోనే AC లు కూలర్ల ద్వారా గదులను భవనాలను చల్లబరిచడానికి అయ్యే విద్యుత్తు ఖర్చు ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో 12.3% అంటే ఆశ్చర్యపోక తప్పదు. దీనికి బదులు ఎవరికి వారికి వారి శరీరాన్ని చల్లబరుచుకుంటే పైన చెప్పుకున్న విద్యుత్తూ వ్యయాన్ని సగానికి తగ్గించవచ్చు. దీనినే Personal Thermal Management అంటారు. ఇప్పుడిప్పుడే పరిశోధకులు దీని పై దృష్టి సారిస్తున్నారు. అంటే ఒంట్లోని చెమట, వేడి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉన్న కొత్త కొత్త వస్త్రాలతో కూడిన బట్టలు ధరించటం వలన మన ఒంటి వేడి బయటకు వెళ్ళిపోయి శరీరాన్ని చల్లబరచడం.

Stanford University లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి చెందిన ప్రొ. Shanhui Fan ఒక సరికొత్త ప్లాస్టిక్ ను వస్త్రాలలో అమర్చడం ద్వారా వేసవిలో మనుషులను కేవలం దుస్తుల ద్వారానే చల్లబరచవచ్చు అని అంటున్నారు. వేసవి కాలంలో ఒంటికి చెమట పట్టడం అనేది శరీరం ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది దానిని చల్లబరుచుకునే పద్ధతి. ఈ క్రమంలో ఆ అధిక ఉష్ణోగ్రత మన శరీరం నుండి ఇన్ఫ్రారెడ్ కిరణాలుగా వెలువడతాయి. ఇవి కంటికి కనబడవు. దీని వల్లనే మనకు వేడిగా ఉంది అనిపిస్తుంది. దీనిని తగ్గించడానికి ఒక ప్లాస్టిక్ తో ఆయన ఒక పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా nanoporous polyethylene (nanoPE) అనే ప్లాస్టిక్ పదార్ధాన్ని దుస్తుల్లో అమర్చడం వల్ల మన ఒంటి చెమటతో పాటు శరీరం నుండి వచ్చే ఇన్ఫ్రారెడ్ కిరణాలను 96 శాతం వరకు బయటకు పంపించగలిగాయి. అదే కాటన్ వస్త్రాలు ద్వారా అయితే కేవలం 1.5 శాతం మాత్రమే ఇన్ఫ్రారెడ్ కిరణాలు బయటకు వెళ్ళగలిగాయి అంటే ఎంత తేడానో మనం ఊహించవచ్చు.

ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా ఈ ప్లాస్టిక్ లో 50 నుంచి 1000 diameter కలిగిన అతి చిన్న రంధ్రాల వల్ల ఇది సాధ్యపడింది. ఈ nanoPE మెటీరియల్ తో కలిపి వస్త్రాలు తయారు చేస్తే వ్యక్తి చుట్టుపక్కల కంటే ఆ వ్యక్తికి కనీసం నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గినట్టు ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కు మరిన్ని రంగులద్ది దీనిని వస్త్రాల్లో ఇమిడేట్టు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పరిశోధక బృందం.

ఈ పరిశోధన సెప్టెంబర్ 1న Journal Science లో ప్రచురించబడింది.

Courtesy