విద్యుద్ శక్తి మనకు ఇప్పుడు అలవాటు అయిపొయింది. కాసేపు విద్యుత్ లేకపోతే ఉండలేని పరిస్థితి. మన ఫోన్లు, ఫ్యాన్లు, ఏసి లు ఆగిపోతాయి. దానితో మన నిత్య జీవనానికి అడ్డంకి ఏర్పడుతుంది. ఇలా మనం కాసేపు విద్యుత్ లేకపోతేనే విలవిలలాడి పోతాం. కానీ అదే కొన్ని దశాబ్దాల పూర్వం మన అమ్మమ్మలు, తాతమ్మలు అదే విద్యుత్ లేకుండా గడిపారంటే మనం కనీసం ఊహించలేం. సాయంత్రం కాగానే కిరోసిన్ దీపాలు వెలిగించుకుని పని కానిచ్చేవారు. సరే అదంతా ఒకప్పుడు అని కొట్టి పారేయలేం. ఈ రోజుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇంకా ఆ కిరోసిన్ దీపాల కిందే చదువుకుంటున్నారు. అవును ఇది నమ్మలేని నిజం.

ఇంట్లో కనీసం ఒక్క బల్బ్ కూడా లేని ఇళ్ళు పేద దేశాల్లో కొన్ని కోట్లు ఉన్నాయి. వీరందరూ కిరోసిన్ దీపాల తోనే కాలం గడుపుతున్నారు. కిరోసిన్ నుండి వచ్చే పొగ పీల్చడం అంటే ఏడాదికి 170 సిగరెట్లు పీల్చడం తో సమానం. అంతే కాదు దీని వల్ల పిల్లలకు, పెద్దలకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వచ్చి వారిని మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. ఈ సమస్యకు సోలార్ లాంప్ లు వంటి పరిష్కారంగా చెప్పినా దానిని తిరిగి మైంటైన్ చేసే ఆర్ధిక స్తోమత కూడా లేని కుటుంబాలు కెన్యా వంటి దేశాల్లో ఎన్నో ఉన్నాయి. మరి దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ GravityLight. అంటే ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేని ఇళ్ళల్లో కూడా కేవలం గురుత్వాకర్షణ తోనే ఒక LED బల్బ్ ను వెలిగించడం. అదెలాగో చూద్దాం.

గురుత్వాకర్షణ శక్తి అప్పుడు ఐంస్టీన్ నే కాదు నేటికి ఎంతో మందిని ప్రేరేపిస్తోంది. అలాంటి ఈ శక్తి తో మన పూర్వీకులు ఎన్నో ప్రయోగాలనే చేసారు. అలా ఆ శక్తి తో విద్యుత్తును ఉత్పత్తి చేయడం కొత్త విషయం ఏమీ కాదు. కానీ ఈ గురుత్వాకర్షణ శక్తితో అత్యంత సులభంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి ఒక LED బల్బ్ ను వెలిగించడం విశేషం. ఈ GravityLight లో మూడు భాగాలు ఉంటాయి. అవి ఒక DC Generator, LED బల్బ్, రెండు తాళ్ళు, ఒక సంచీ. ఈ సంచీలో రాళ్ళూ లేదా ఇసుక తో నింపి ఉంచాలి.

ఈ పరికరాన్ని ఏదైనా ఒక మేకుకు తగిలించి ఉంచితే. గురుత్వాకర్షణ శక్తికి ఈ సంచి కిందకి వచ్చే కొద్దీ ఈ DC generator పని చేయడం మొదలు పెట్టి విద్యుదుత్పత్తి జరిగి LED బల్బ్ వెలుగుతుంది. అలా ఎంత సేపు వెలుగుతుంది అంటే ఒక అరగంట పాటు బల్బ్ వెలగడానికి కావాల్సిన శక్తి ఉత్పన్నమవుతుంది. ఇక దీనిలో సంక్లిష్టమైన భాగాలు లేకపోవడం తో కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి maintenance లేకుండా ఇది అక్కడి ప్రజలకు ఉపయోగపడుతుంది. పైగా దీనిని ఉపయోగించడానికి ఏమాత్రం చదువు కూడా అవసరం లేకపోవడం విశేషం.

ఈ GravityLight 2015 Shell’s Springboard Program లో విజేతగా నిలిచింది. దీనిని Deciwatt అనే సంస్థ రూపొందించి కెన్యా లోని ఇలాంటి ఎన్నో పేద కుటుంబాల ఇళ్ళల్లో వెలుగులు నింపుతోంది.

Courtesy