ఒకప్పటి సంగతేమో తెలీదు కానీ ప్రస్తుత కాలంలో అన్నీ నకిలీలే, నాసిరకం వస్తువులే మనకు దొరుకుతున్నాయి. కొద్ది కాలం క్రితం ఒక సంస్థ యొక్క నూడుల్స్ మొదలైనవి హానికారకమైన పదార్ధాలతో తయారు చేసారన్న వార్త బయటకు వచ్చింది. అంతే, ఆ తరువాత దరిమిలా ఇలాంటివి ఎన్నో వస్తువులు మన నిత్య జీవితంలో ఉన్నాయనే వాస్తవాన్ని ఆ సంఘటన మనకు తెలియచేసింది. మనం తాగే పాల దగ్గర నుంచి మాంసం, తినిబండారాలు, కరెన్సీ మొదలుకుని వైద్యుడు రాసిన మందుల వరకు అన్నీ నకిలీలు లేదా నాసిరకం మాత్రమే మార్కెట్ లో దొరుకుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ఇలాంటి నకిలీ, నాసిరకం వస్తువుల నుండి తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

LinkSquare handheld scanner

LinkSquare handheld scanner

ఈ సమస్య కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అమెరికా ను సైతం పట్టి పీడిస్తున్నదీ సమస్య. అంతెందుకు 2013 రిపోర్ట్ మేరకు అమెరికాలో రెస్టారెంట్ లేదా కిరాణా దుకాణాల్లో దొరికే 30 శాతం మేర చేపలు/మాంసం పాడైనదే. అలాగే అమెరికాలో 40% మేర దొరికే మందులు నకిలీ లేదా నాసిరకం అని తేలింది. అందువల్ల ఈ నకిలీ సమస్య పెను భూతమై ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. దీనిని అరికట్టే అధికారిక సంస్థలు చట్టాల కన్నా సాంకేతిక పరిజ్ఞ్యానం నయమని ఆ విధమైన సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని అభివృద్ధి చేస్తున్నారు పరిశోధకులు.

అమెరికాలోని Stratio సంస్థ LinkSquare అనే పోర్టబుల్ స్కానర్ ను తయారు చేసింది. ఈ వైర్లెస్ స్కానర్ మనం నిత్యం తినే ఆహార పదార్ధాలు, మందుల దగ్గర నుండి మనం వాడే కరెన్సీ వరకు నకిలీలను కనిపెట్టేస్తుంది. అమెరికాలో Stanford University కి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు నలుగురు సంయుక్తంగా ఈ సంస్థను స్థాపించి ఈ పరికరాన్ని అభివృద్ధి చేసారు. దీనిని తాజాగా లాస్ వేగాస్ లో జరిగిన CES 2018 (Consumer Electronic Show) లో విడుదల చేసారు. ఇక ఈ స్కానర్ ఒక మొబైల్ యాప్ కు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. మీరు ఏదైనా వస్తువును ఈ పరికరంతో స్కాన్ చేస్తే చాలు దాని వివరాలు మీకు యాప్ లో వచ్చేస్తాయి. ఇక ఇది spectroscopy ఆధారంగా పని చేస్తుంది. అంతరిక్షంలో వ్యోమగాములు అక్కడి రాళ్ళ composition ను తెలుసుకోవడానికి చేసే స్పెక్ట్రోస్కోపీ నే ఈ పరికరంలో కూడా వాడబడింది.

Linksquare  handheld scanner

Linksquare handheld scanner

ఈ పరికరంలో germanium-based Short Wave Infrared sensor ను ఉపయోగించారు. ప్రతీ వస్తువు/ఆహార పదార్ధంలోని molecules ఒక్కో విధమైన vibration కలిగి ఉంటుంది. దాని మీద కాంతి ప్రసరించినప్పుడు ఒక్కో molecule ఒక్కో విధంగా ప్రతిఫలిస్తుంది. అలా ఆ వస్తువు మొత్తం ఒక విధంగా ప్రతిఫలిస్తుంది. దీనినీ optical fingerprint అంటారు. ఇది ఒక్కో వస్తువుకు ఒక్కోలా ఉంటుంది. అందులో కల్తీ జరిగితే ఆ వస్తువు యొక్క optical fingerprint మరోలా ఉంటుంది. ఈ విధంగా LinkSquare తో స్కాన్ చేసిన వస్తువు యొక్క optical fingerprint ను ప్రత్యేకమైన ఆల్గోరిథమ్స్ ద్వారా డేటాబేస్ లో వెతికి సరైనదో కాదో యాప్ ద్వారా చెప్పేస్తుంది.

ఇలా ఆహార పదార్ధాల నాణ్యతను తెలియచెప్పే పరికరాలు చాలా అతి తక్కువ అందుబాటులో ఉన్నాయి. దీనిని బట్టి భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని మనకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఈ పరికరం ధర $299.