మనం గత వారం అమెరికా లోని లాస్ వేగాస్ లో, ప్రతీ సంవత్సరం జరిగే CES (Consumer Electronics Show) 2017 గురించి చెప్పుకున్నాం. అందులో ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే సరికొత్త పరికరాలను ఆయా సంస్థలు ప్రదర్శించాయి. అలా మనం ఈ సంవత్సరం ఆహార రంగంలో (food technology) రాబోయే పరికరాలు వాటి ప్రత్యేకత గురించి చెప్పుకుందాం.
ఆహారం అంటే మనకు గుర్తొచ్చేది వంటిల్లు. అంటే మనం సహజంగానే వంటింటికీ తద్వారా మన ఆరోగ్యానికీ సంబంధించే పరికరాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. స్మార్ట్ కిచెన్ పేరుతో ఇప్పుడు మన ఊహకు కూడా అందని కొన్ని పరికరాలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాట్లాడే ఫ్రిడ్జ్ లు, తినే కెలొరీలను లెక్కించే యాప్ లు, వంటింట్లోని వ్యర్ధమైన ఆహార పదార్ధాల నుంచి ఎరువును తయారు చేసుకునే పరికరాలను ఈ CES 2017 లో ప్రదర్శించారు. అవేంటో ఈ రోజు చూద్దాం.

Whirlpool Zera Home Recycler: సహజంగానే మనకు వంటింట్లో ఎంతో కొంత వ్యర్ధాలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా వండినా ఎదో ఒక ఆహార పదార్ధం మిగిలిపోవడం మనకు ప్రతీ సారీ అనుభవమే. ఒక్క పూటకే కదా అనుకోకుండా అదే ఏడాది మొత్తానికి లెక్కేస్తే అబ్బో చాలా కేజీల వ్యర్ధాలు మనం వృద్ధి చేస్తున్నాం. అవన్నీ చెత్త బుట్టలో వేసి చేతులు దులుపుకోకుండా ఆ వ్యర్ధాలను ఇంట్లోనే శుద్ధి (recycle) చేయడం ద్వారా ఎంతో మెరుగైన ఎరువును ఇంట్లోనే తయారు చేయచ్చు అంటున్నారు Whirlpool సంస్థ వారు. ఈ సంస్థ ప్రవేశ పెట్టిన Zera Home Recycler ఇంచుమించి మన వంటింటి గట్టు అంత ఎత్తు ఉండి అందులో ఏ ఆహార వ్యర్ధాలను వేసినా ఎలాంటి వాసన లేకుండా కేవలం 24 గంటల్లో ఎరువును మనకు ఇస్తుంది. ఇది పాల ఉత్పత్తులు, కుళ్ళిన పళ్ళ నుంచి మాoసం వరకు దేన్నైనా ఇందులో వేయచ్చు. ఈ ఉత్పత్తికి Best of Innovation Award లభించడంలో ఆశ్చర్యం లేదు కదూ. ప్రస్తుతం ఈ ఉత్పత్తి ప్రీ ఆర్డర్ ద్వారా లభిస్తుంది. దీని ధర $999 నుండి $1200 వరకు ఉండచ్చు. ఇది పూర్తిగా మార్కెట్లోకి రావడానికి మరి కొన్ని నెలలు పడుతుంది అంటున్నారు ఈ సంస్థ ప్రతినిధులు.

Lose it వారి Snap it: ఇప్పటికే మార్కెట్లో బరువు తగ్గేందుకు తినే ఆహారంలో ఎన్ని కెలొరీలు ఉన్నాయో చెప్పే యాప్ లు వచ్చేసాయి. అందులో ఎంతో పేరు మోసిన యాప్ Lose it. ఇప్పటికే ఎంతో మంది అమెరికన్లు దీనిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్ రూపకర్తలు దీన్లో మరో ఫీచర్ ను జత చేసి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందిస్తున్నారు. ఆ కొత్త ఫీచరే Snap it. ఇది అధునాతన image recognition సాంకేతిక పరిజ్ఞ్యానం తో పని చేస్తుంది. అంటే ఈ యాప్ లోకి వెళ్లి మనం మన ముందున్న ఆహారాన్ని ఒక్క photo తీస్తే అది ఆయా ఆహార పదార్ధాలను గుర్తు పడుతుంది. అప్పుడు అక్కడ మనం ఆయా పదార్ధాలు ఎంత పరిమాణంలో తీసుకుంటున్నమో (ఉదా. టేబుల్ స్పూన్) తెలియచేస్తే కేవలం సెకండ్లలో అందులో ఎన్ని కెలొరీ లు ఉన్నాయో చెప్పేస్తుంది. పైసా ఖర్చు లేకుండా తమ ఆహారపుటలవాట్లను, బరువును తగ్గించుకోవాలి అనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.

Smart Refrigerators: మనలో చాలా మందికి ఫ్రిడ్జ్ అంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్. అంతే మనం అక్కడే ఆగిపోయాం. ఇప్పుడిప్పుడు ఈ దశాబ్దాల మోడల్ ను తలదన్నేలా డిజిటల్ వి అందుబాటులోకి వస్తున్నా అందులో ధర, కొద్దో గొప్పో హంగు తప్ప తల తిరిగే సాంకేతికత ఏమీ లేదు. కానీ ఇప్పుడు రాబోతున్నాయి. మాట్లాడే ఫ్రిడ్జ్ లు. అవును అక్షరాలా మాట్లాడే ఫ్రిడ్జ్ లే. ఈ CES show లోనే LG, Smasung వంటివి ఈ smart refrigerator లను ప్రవేశ పెట్టాయి. ఇవి ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులను దాని పైన డిస్ప్లే లో చూపిస్తాయి. అలాగే మనం పెట్టే వస్తువులను బట్టి దాన్లో ఏమేం అయిపోయాయో కూడా మన ఫోనుకు మెసేజ్ చేస్తుంది. అంతేనా మనం మర్చిపోతే అదే ఆన్లైన్ లో ఆర్డర్ కూడా చేసేస్తుంది. ఇక ఎప్పుడైనా మనం బజార్లో ఫ్రిడ్జ్ లో ఏమేం ఉన్నాయో చూద్దాం మర్చిపోయనే అనుకోకుండా మనం ఇంట్లో, ఆఫీస్ లో, ఇక్కడ ఉన్న సరే ఒక యాప్ ద్వారా ఫ్రిడ్జ్ లో ఏమేం ఉన్నాయో చూసే వీలు కల్పిస్తాయి ఈ కొత్త తరం ఫ్రిడ్జ్ లు.

Courtesy