డయాబెటిస్ తో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. వీరిలో పెద్ద వయసు వారే కాకుండా చిన్న వయసు వారు కూడా ఉంటున్నారు. వీరు ఎప్పటికప్పుడు అంటే కనీసం నెలకోసారి అయినా గ్లూకోస్ పరీక్ష చేయించుకోక తప్పదు. ఇందుకోసం మన దేశంలో అయితే గ్లూకోమీటర్లు వచ్చేసాయి. అలాగే విదేశాల్లో అయితే అందుబాటులో ఉన్న మరి కొన్ని wearables గురించి కూడా గతoలో చెప్పుకున్నాం. వీటిలో సగానికి పైగా ప్రతీ సారీ సూది పోటు భరించాల్సి ఉంటుంది. అందువల్ల ఇంతకంటే సౌకర్యవంతమైన పద్ధతులను అన్వేషిస్తున్నారు పరిశోధకులు. అందులో భాగంగానే ఒక వినూత్నమైన పద్ధతిలో గ్లూకోస్ పరీక్ష సాధ్యపడుతుందని అంటున్నారు అమెరికా పరిశోధకులు. అదేలాగో చూద్దామా.
అమెరికా లోని Oregon State University కి చెందిన పరిశోధకులు ఒక ప్రత్యేకమైన కాంటాక్ట్ లెన్స్ ను తయారు చేసారు. దీనిని కంట్లో పెట్టుకుంటే చాలు కంట్లోని చెమ్మ, అదే కన్నీళ్ళ ద్వారా గ్లూకోస్ స్థాయిలను అంచనా వేసి సెల్ ఫోన్ కు పంపిస్తుంది. దీనికి అనుసంధానంగా ఒక యాప్ ను రూపొందిస్తే దీనికి తగ్గట్టు ఇన్సులిన్ వేసుకోవాల్సిన ప్రతీసారీ వైద్యుని అవసరం లేకుండానే ఎన్ని యూనిట్లు వేసుకోవాలో తెలిసిపోతుంది. ఈ కాంటాక్ట్ లెన్స్ ను sight ఉన్న వారికి కూడా వారి అవసరాలకు తగ్గట్టు తయారు చేయగలగడం విశేషం. అంటే ఓ పక్కన ప్రిస్క్రిప్షన్ లెన్స్ తో పాటు గ్లుకోమీటర్ కూడా దగ్గరున్నట్టే. అంత చిన్న కాంటాక్ట్ లెన్స్ లోని సెన్సర్ వల్ల ఇది సాధ్యమంటున్నారు ఈ బృంద సభ్యులు.
అయితే ఈ లెన్స్ ను వచ్చే సంవత్సరానికల్లా అందుబాటులోకి తేవాలని ఈ పరిశోధనా బృందం ప్రయత్నిస్తోంది. చూద్దాం వీరి ప్రయత్నం ఫలించి ఇది అందుబాటులోకి వస్తే ఎంతో సులువుగా రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను అంచనా వేయడం వల్ల డయాబెటిస్ ఉన్న వారు మరింత సౌకర్యంగా, సంతోషంగా జీవించవచ్చు.