పాస్వర్డ్ (Pass word) లు సుమారు ఈమెయిలు మొదలయినప్పటి నుంచీ బాగా వాడుక లోకి వచ్చాయి. అంటే సుమారుగా 1990 ల నుంచీ అన్న మాట. ఇక అటు తర్వాత అంతర్జాలం పుణ్యామా అని అవి ఎన్నో వస్తువులకు, యాప్ లకు మరెన్నిటికో ఈ పాస్వర్డ్ వ్యాపించింది. ఇది వినియోగదారులకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం సృష్టించబడింది. ఇప్పుడు షాపింగ్ కు, బ్యాంకింగ్ కు, ఎంటర్టైన్మెంట్ ఇలా ఏ వెబ్ సైట్ తెరచి చూడాలన్నా ఈ పాస్వర్డ్ కావాలి. ఇది ఒక తల నొప్పి అయ్యి కూర్చుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ సమస్యను గ్రహించి ఎంతో మంది ఇప్పటికే కొన్ని రకాల పరిష్కారాలతో ముందుకు వచ్చారు. అందులో కొన్ని ఈ పాస్వర్డ్ లాకర్ వంటి యాప్ లు అయితే మరి కొన్ని బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఏది ఏమైనా ఇవి కూడా పాత పద్ధతులే అని చెప్పాలి. ఎందుకంటే వీటికి మించి వినూత్నమైన పద్ధతుల్లో పరిష్కారాన్ని వెతుకుతున్నారు పరిశోధకులు. అలాంటి ఒక వినూత్నమైన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హాలీవుడ్ సినిమాల్లో అలాగే మరికొన్ని సినిమాల్లో కంటి రెటీనా వంటి వాటిని ఉపయోగించడం మనం ఇప్పటికే చూసి ఉన్నాం. అయితే అంతకు మించి ఆశ్చర్యం కలిగించేలా మనిషి పుర్రె ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించడం ఎక్కడైనా చూసారా, కనీసం విన్నారా? లేదు కదూ. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

University of Stuttgart, Saarland University మరియు Max Planck Institute for Informatics, జర్మనీ కి చెందిన పరిశోధకులు ఈ వినూత్నమైన పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఈ పరిశోధన లో వీరు గూగుల్ గ్లాస్ ను ఉపయోగించారు. ఇది ఎలా పని చేస్తుంది అంటే, ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ఈ పరికరాన్ని పెట్టుకున్న మనిషికి వినిపిస్తారు. ఇప్పుడు ఈ గూగుల్ గ్లాస్ లోని తలకు ఇరువైపులా ఉన్న కాళ్ళలోని bone conduction ద్వారా ఈ శబ్దం పుర్రెకు చేరుతుంది. అక్కడనుంచీ ఆ పుర్రె నుంచీ వచ్చీ frequency ఈ గూగుల్ గ్లాస్ లోని మైక్రో ఫోన్ కు చేరుతుంది. వీటిని విశ్లేషించిన పరిశోధకులు ఒక్కో మనిషి పుర్రె నుంచీ వచ్చే sound frequency ప్రత్యేకంగా ఉందని కనుగొన్నారు. అంటే ఒక వ్యక్తి పుర్రె నుంచీ వచ్చే frequency మరొక వ్యక్తి కన్నా భిన్నంగా ఉందన్న మాట.

ఇందువల్ల దీనిని ఆ మనిషి కి ఐడెంటిఫికేషన్ గా పని చేస్తుందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఈ పద్ధతిలో మనిషి పుర్రె నుంచీ వచ్చే శబ్ద తరంగాలను విశ్లేషించడానికి bone conduction మరియు మైక్రో ఫోన్ కలిగిన ఏ పరికరం అయినా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో కేవలం 10 మంది మీద మాత్రమే ఈ ప్రయోగం చేసారు. అయినప్పటికీ ఇది విజయవంతంగా పని చేసిందని ఈ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఒక రోజులో ఎన్నో సార్లు ఈ పద్ధతి ద్వారా పరికరాలను unlock చేయడానికి ప్రయత్నించగా 97 శాతం విజయవంతం అయిందని కూడా వీరు పేర్కొన్నారు.

ఏమో భవిష్యత్తులో మనల్ని మనం నిరూపించుకోవడానికి ఏమేమి పరికరాలు మనల్ని ఎలా పరీక్షిస్తాయో వేచి చూడాలి.

 

Courtesy