ఒకప్పుడు కాన్సర్ జబ్బుకు మందే లేదు. ఈ జబ్బు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంది, తీసుకుంటోంది కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బును అరికట్టాలని పరిశోధకులు కంకణం కట్టుకున్నారు. కారణం, ఏటా అన్ని ప్రాణాంతక జబ్బుల వల్ల చనిపోయే వారిలో కేవలం ఈ కాన్సర్ వల్ల చనిపోయే వారి సంఖ్యే ఎక్కువ కాబట్టి. ఈ కాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయేది స్కిన్ కాన్సర్ అంటే మెలనోమ (melanoma) గురించి. ఇప్పటికే ఈ స్కిన్ కాన్సర్ కు పలు రకాల పరికరాల ద్వారా సులువుగా కనిపెట్టే మార్గాలను అన్వేషించారు. ఇప్పుడు మనం అలాంటి మరో సులువైన అతి తేలికైన చవకైన పద్ధతి గురించి చెప్పుకుందాం. McMaster University, కెనడా కి చెందిన విద్యార్ధులు – Michael Takla, Rotimi Fadiya, Prateek Mathur, and Shivad Bhavsar లు sKan అనే పరికరం ద్వారా స్కిన్ కాన్సర్ ను కనిపెట్టవచ్చని రుజువు చేసారు.

సహజంగా ఏవో పరికరాలో, దానికి సంబంధించిన యాప్ లో ఉంటాయి అనుకుంటే పొరపాటే. అతి చవకగా లభించే వస్తువులతో ఈ sKan ను తయారు చేసారు. ఈ పరికరమే కాదు దీని వెనుక ఉన్న సూత్రానికి మనం ముగ్ధులు అవ్వాల్సిందే. అందుకే ఈ sKan కు ప్రఖ్యాత International James Dyson Award 2017 వచ్చింది.

చర్మo మీద మచ్చలా తోచిన ప్రాంతం మీద, సాధారణంగా కనిపించిన చర్మ ప్రదేశం మీద ఒక ఐస్ గడ్డను పెట్టి తీయాలి. అలా తీయగానే ఆ చర్మం లోపలి చర్మ కణాలు కాన్సర్ కణాలు ఉంటే అవి అత్యంత వేగంగా తిరిగి వేడెక్కిపోతాయి. ఐస్ గడ్డ పెట్టక ముందు, పెట్టిన తరువాత ఈ రెండు ప్రదేశాలలో చర్మ ఉష్ణోగ్రతలో కలిగిన మార్పు ద్వారా స్కిన్ కాన్సర్ ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు. ఈ సూత్రం ఆధారంగానే ఈ పరికరాన్ని రూపొందించారు McMaster University విద్యార్ధులు. ఈ పరికరం sKan (skin cancer detector)లో 16 thermistorలు కలిగి ఇవి చర్మ ఉష్ణోగ్రతను గమనిస్తూ ఉంటుంది. ఈ పరికరాన్ని చర్మం మీద పెట్టగానే ఆ ప్రదేశం యొక్క heat map ఈ thermistors ద్వారా కంప్యూటర్ పై వచ్చేస్తుంది. ఆ పైన ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పును చూడటం ఎవ్వరికైనా పెద్ద కష్టం ఏం కాదు కదూ.
కేవలం ఈ పరికరం ఉంటే చాలు ఎలాంటి వారైనా తమకు తాము స్కిన్ కాన్సర్ ఉందో లేదో కనుగొనవచ్చు. అంతే కాదు ఈ పరికరం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు కూడా అత్యంత చవకగా దొరికేవే. అత్యంత సులభ పద్ధతి ఆధారంగా స్కిన్ కాన్సర్ ను గుర్తించగలిగే పరికరాన్ని తయారు చేసినందుకు ఈ విద్యార్ధి బృందానికి Dyson అవార్డు వచ్చింది. దీని గురించి ఈ బృందం మాట్లుడుతూ చర్మ ఉష్ణోగ్రత ద్వారా స్కిన్ కాన్సర్ టిష్యూ ను కనిపెట్టవచ్చు, కానీ అది చాలా అధునాతన ఖరీదైన పరికరాలతోనే సాధ్యం. మేము దానినే సరళీకరించి సులువుగా అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశ్యం తో ఈ ప్రయత్నం చేసాం అని అన్నారు. అంతే కాదు ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి త్వరలోనే అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తాం అని అన్నారు.

Courtesy