వేసవి కాలం(Summer Season) వచ్చేసింది. బయటికెళ్లి వస్తే చాలు మాడు మాడిపోతుంది. ఒంట్లో వేడి పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం బోలెడన్ని పానీయాలు తాగేస్తుంటాం. సాఫ్ట్ డ్రింక్స్(Soft Drinks), ఆర్టిఫిషియల్ జ్యూస్లు(Artificial Juices), షరబత్లు(Sharbath) ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలనిపిస్తుంది. కానీ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంటి దగ్గరే మనకు మంచి పానీయం ఉంది.

అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మరిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు.

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్(Dehydration), శ్వాసకోస వ్యాధులు(Respiratory diseases) ఇలా చాలా వాటికి సబ్జా గింజలు(Sabja Seeds) మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

గుప్పెడు సబ్జా గింజలను తీసుకొని వాటిలో చిన్న చిన్న రాళ్లు, బెడ్లు ఉంటే ఏరేయాలి. మంచి నీళ్లతో వాటిని శుభ్రంచేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు కాస్త జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగొచ్చు, లేదంటే పంచదార కలిపిన నీటిలో వేసుకుని తీసుకోవచ్చు. సబ్జా గింజల్లో పీచు(Fiber) ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.

రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఊబకాయం(Obesity)తో బాధపడే చాలా మందికి సబ్జా గింజల పానీయం మంచి చిట్కాలా పనిచేస్తుంది.

ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కేలరీలు(Calories) కూడా చాలా తక్కువే.

చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు(Glucose Levels) తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహం (Diabetes)తో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.

తరచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు సబ్జా గింజల పానీయం తాగితే మంచిది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు(Health Problems) దూరమవుతాయి.

గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు(Infections) దగ్గరకు రావు. సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు(Fatty Acids), పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి.

సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం.  సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.