డ్రోన్లు. ప్రస్తుతం ఇవి మన సాంకేతికత సృజించిన చంటి పాపలు. ఎందుకంటే ఇవి ప్రస్తుతం చాలా ప్రాధమిక దశలో ఉన్నాయి. వీటి సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దీని వల్ల చాలా చాలానే ఉపయోగాలున్నాయి. అలా వినియోగించుకునే ముందు ప్రపంచవ్యాప్తంగా దీని పట్ల చాలానే పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిని మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుతున్నారు పరిశోధకులు. ఇందులో భాగంగా అమెరికా లోని ఆరిజోన స్టేట్ యూనివర్సిటీ (Arizona State University) కి చెందిన పరిశోధకులు ఈ డ్రోన్లను కంటితోనే నియంత్రించే ప్రయత్నంలో ఉన్నారు.

ఇటువంటి ప్రయత్నాలు ఇప్పటికే చైనా కు చెందిన Zhejiang University అలాగే University of Minnesota లు కూడా చేసాయి. అయితే వారు ఒక డ్రోన్ ఎలాంటి రిమోట్ లేకుండా కేవలం వీరి చేతి కదలికల ద్వారా ముందుకీ వెనక్కి వెళ్ళడం వంటివి చేసారు. అయితే ఇప్పుడు ASU పరిశోధకులు తలపెట్టినది అత్యంత సంక్లిష్టమైనది. వీరు ఒకేసారి ఎలాంటి రిమోట్ కంట్రోల్ లేకుండా మూడు డ్రోన్ లను అలాగే రెండు రోబోట్ లను నియంత్రించే ప్రయత్నం చేసారు. ఇందుకోసం వీరు మానవ మెదడులోని భావ తరంగాల ద్వారా ఈ ప్రయత్నం చేసారు. పైగా మెదడులో డ్రోన్ లను నియంత్రించే భాగాన్ని కనిపెట్టి అక్కడి సమాచారాన్ని ఈ డ్రోన్ లకు వైర్లెస్ గా పంపిస్తే ఇలా ఒక వ్యక్తి రిమోట్ లేకుండా డ్రోన్ లను నియంత్రించడం సాధ్యమే అంటున్నారు.

ఇందుకోసం వీరు ఒక skull cap (EEG) తయారు చేసారు. దీనికి 128 ఎలక్ట్రోడ్ లను అమర్చి దానిని కంప్యూటర్ కు అనుసంధానం చేసారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ డ్రోన్ లను గూర్చి మెదడులో అనుకుంటున్నా సమాచారం అంతా కంప్యూటర్ లో చూడవచ్చు. అలాగే వాటికి ఇంత వేగంతో వెళ్ళు, కుడి వైపుకు వెళ్ళు, ఎడం వైపుకు వెళ్ళు వంటి ఆదేశాలు, కేవలం మనలో మనం అనుకుంటే చాలు, ఆ సమాచారం ఆదేశాలుగా కూడా ఇవ్వవచ్చు అని నిరూపించారు. మూడు డ్రోన్లు, నేల మీద తిరిగే రెండు రోబోట్లు ఒక దానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ సమిష్టిగా పని చేసాయి అని చూపించారు. అంతే కాదు ఇన్ని డ్రోన్లను ఉపయోగించేందుకు ఎక్కువ మంది వ్యక్తుల అవసరం లేకుండా అధిక సంఖ్యలోని డ్రోన్లు మరియు రోబోట్ లను కేవలం ఒక్క వ్యక్తే నియంత్రించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

అయితే వీరి పరిశోధన చాలా ప్రాధమిక దశలో ఉంది. దీనిని మరింత అభివృద్ధి చేయగలిగితే భద్రతా వ్యవస్థలో ఇటువంటి పరిజ్ఞ్యానం యొక్క అవసరం చాలానే ఉంది అని చెప్పాలి.

Courtesy