గుండె జబ్బులు ఒకప్పుడు ఏ కొద్ది మందికో ఉండేవి. అదే ఇప్పుడు ప్రపంచీకరణ పుణ్యమా అని మారిపోతున్న జీవ శైలి సాక్షిగా ఎందరో దీని బారిన పడుతున్నారు. అందులోను వైట్ కాలర్ ఉద్యోగులు ముందు వరసలో ఉన్నారు. ఇది ఈ కాలంలో ఏ యాభై ఏళ్లకో వస్తే పర్వాలేదు. కానీ 35-45 వయస్కులు దీని బారిన పడటం గమనించాల్సిన విషయం. అయితే మిగతా జబ్బుల విషయంలో రోగ నిర్ధారణకు, చికిత్సకు సమయం ఉంటుంది. అదే ఈ గుండె పోటు తదితర రోగాల విషయంలో అసలు సమయమే ఉండదు. అందువల్ల ఈ CHD (Coronary Heart Disease) విషయంలో చాలా జాగరూకత అవసరం.

ఇదేంటి మధ్యలో ఈ CHD ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ CHD అంటే గుండెకు ప్రాణ వాయువును తీసుకెళ్ళే రక్త నాళాలు మూసుకుపోయే స్థితినే CHD అంటారు. తద్వారా గుండె పోటు వస్తుంది. అయితే ఈ గుండె పోటు వస్తే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో పోల్చుకోవచ్చు కానీ అసలు ఎవరికి ఖచ్చితంగా ఈ గుండె పోటు సంభవిస్తుందో చెప్పగలమా? ఓ అందుకు మనకు అందుబాటులో ఉన్న క్లినికల్ పరీక్షలు – BMI, హార్ట్ బీట్, రక్త పోటు, ECG వంటివి ఉన్నాయి కదా అంటే, అవి కూడా అంత ఖచ్చితంగా నిర్దారించలేవు అంటున్నారు UK లోని University of Leicester కు చెందిన పరిశోధక బృందం. అంతకు మించి ఖచ్చితంగా CHD సంక్రమించే వ్యక్తులను కొన్నేళ్ళ ముందుగానే GRS సహాయంతో గుర్తించవచ్చు అంటున్నారు వీరు. అదెలాగో చూద్దాం.

ముందుగా మనం తెలిసుకోవాల్సింది ఏమంటే గుండె జబ్బులు హఠాత్ పరిణామo కాదు. మన జన్యువులలో కొన్నేళ్ళ ముందుగానే మార్పులు జరిగి క్రమంగా ఈ CHD కు కారణమవుతున్నాయి. GRS అంటే Genomic Risk Score. గుండె పోటు మొదలైన గుండె జబ్బులు జన్యు లోపం కారణంగా సంక్రమిస్తాయని మనకు ముందే తెలుసు. అయితే ఇప్పుడు అభివృద్ధి చెందిన జన్యు శాస్త్రం ద్వారా SNP (Single Nucleotide Polymorphism) లను గుర్తించగలిగారు. ఈ SNP అంటే మనుషుల DNA లలోని అతి చిన్న మార్పులను SNP అంటారు. ఈ SNP లు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. ఇలా సుమారుగా 49,000 SNP లను పరిశీలించి ఈ బృందం ఒక Genomic Score ను తయారు చేసింది. దీని ఆధారంగానే వ్యక్తులకు సుమారు 10 ఏళ్ల ముందుగానే గుండె జబ్బులు సోకే అవకాశం ఉందని నిర్ధారించవచ్చు.

దీని ఆధారంగా అంటే ఈ GRS ఆధారంగా వ్యక్తులకు 5 రెట్లు అధికంగా CHD ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ బృందం పేర్కొంది. వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారికైనా ఈ GRS తో వారికి భవిష్యత్తులో CHD రిస్క్ తెలుసుకోవచ్చని ఆ విధంగా తగిన ముందు జాగ్రత్త చర్యలతో ఈ గుండె జబ్బులను నివారించవచ్చని ఈ బృందంలో ఒకరైన Nilesh Samani పేర్కొన్నారు. ఈ పరిశోధన European Heart Journal లో ప్రచురించబడింది.

Courtesy