ఫోన్లు స్మార్ట్ అయ్యాక దానితో మనకు చాలా ప్రయోజనాలే కలుగుతున్నాయి. దీని ద్వారా మన చేతిలోకి వచ్చి పడే సర్వీసుల మాట అటుంచి రోజు రోజు కూ దీనిననుసరించి పెరిగిపోతున్న సాంకేతికతను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన ఊహకు కూడా అందని విధంగా ఈ స్మార్ట్ ఫోన్ల చుట్టూ సాంకేతిక విజ్ఞ్యానం అల్లుకుపోతోంది. ఇప్పుడు అందులో భాగంగానే మరొక ఉపయోగాన్ని ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఇవ్వబోతోంది.

అదేంటంటే రోజు రోజుకూ ఎంతో నాజూగ్గా తయారవుతున్న ఈ ఫోన్లలో మనం ఏదైనా text టైపు చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. అంతేకాదు ముట్టుకుంటే జారిపోయే ఈ ఫోన్లతో ప్రతీ సారీ జేబులో నుంచీ బయటకి తీసి ఉపయోగించడం కొంచెం కష్టమే కదూ. ఇక ఆ ఇబ్బంది లేకుండా ఈ స్మార్ట్ ఫోనును ఉపయోగించాలంటే ఈ ఫోను dispaly మీదనే text టైపు చేయాల్సిన పని లేదు. మనం కూర్చున్న బల్ల మీద కానీ లేదా గాలిలోనైనా, మరెక్కడైనా సరే మనం ఫోనును ఆపరేట్ చేయవచ్చు. అదెలాగో చూద్దామా..

University of Washington కు చెందిన పరిశోధకులు రాజలక్ష్మి నందకుమార్ తన బృందంతో ఒక యాప్ ను తయారు చేసారు. అదే ఈ FingerIO యాప్. ఇది Sonar (Sound Navigation and Ranging) టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. ఇందులో, స్మార్ట్ ఫోను లోని స్పీకర్ ద్వారా శబ్ద తరంగాలు విడుదల అయ్యి అవి ప్రయాణించి చేతి వేళ్ళకు తగిలి తిరిగి ఫోనులోని మైక్రోఫోనుకు వస్తాయి. దీని ద్వారా చేతి వేళ్ళు ఎక్కడ ఉన్నాయో ఈ యాప్ అంచనా వేస్తుంది. అప్పుడు ఆ చేతి వేళ్ళ కదలికలు రికార్డు చేయబడతాయి. ఇప్పుడు ఆ కదలికల ద్వారా ఫోనులో text చేయచ్చు, లేదా ఏదైనా మీడియా ఫైల్స్ ప్లే చేయవచ్చు.

UW కి చెందిన పరిశోధకులు దీని సమర్ధతను పరీక్షించడానికి ఒక ప్రయోగం చేసారు. వీరు రెండు మైక్రోఫోన్లు కలిగిన స్మార్ట్ ఫోను మరియు స్మార్ట్ వాచ్ ను ఈ నమూనా FingerIO యాప్ కొరకు ప్రత్యేకంగా తయారు చేసారు. రెండు మైక్రోఫోన్లు ఎందుకంటే చేతి వేళ్ళ కదలికలను 2D లో గమనించేందుకు రెండు మైక్రోఫోన్లు అవసరం అవుతాయి. ఇప్పుడు కొంత మందిని ఈ స్మార్ట్ ఫోను పక్కనే ఒక టచ్ పాడ్ మీద ఏదైనా ఆకృతులు గీయమని అడిగారు. ఉదా. స్టార్స్, 8 అంకెలు ఇలా. అలా టచ్ పాడ్ మీద గీసిన ఆకృతులను, ఈ FingerIO యాప్ తో పోల్చి చూడగా, ఈ యాప్ సరిగ్గా ఆయా ఆకృతులను యాప్ లో చూపించింది అన్నమాట.

ఇది అందుబాటులోకి వస్తే దీనితో చాలా ఉపయోగాలున్నయనే చెప్పాలి. ముందుగా మన ఫోన్లను ఎక్కువ సార్లు బయటకు తీయాల్సి రాకపోవడం తో అది సురక్షితంగా, శుభ్రంగా ఉంటుంది. అలాగే డ్రైవింగ్లో, ప్రయాణాల్లో భోజనం చేస్తున్నప్పుడు లేదా మరేదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కూడా ఈ యాప్ ఎంతో పనికొస్తుంది. హాండ్స్ ఫ్రీ కాలింగ్ మాదిరి హాండ్స్ ఫ్రీ ఫోను అని కూడా అనిపించుకుంటుంది.

Courtesy