ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్. ఇప్పుడు ఇక్కడ చూసిన యువత దగ్గర నుంచి 50 ఏళ్ల వారి వరకు అందరూ ఇదే మంత్రం జపిస్తున్నారు. ఆరోగ్యం కోసం తపించడం తప్పు లేదు కదా. అయితే ఎంత వ్యాయామం చేస్తున్నా ఏ మాత్రం ఫలితం కనబడటం లేదు, అసలు నిజంగా ఒంట్లో పేరుకున్న కొవ్వు కరుగుతోందా, ఏం చేస్తే అది ఎక్కువగా కరుగుతుంది, అసలు వ్యాయామం మొదలు పెట్టిన ఎంత సమయానికి కొవ్వు కరగడం మొదలవుతుంది వంటి సందేహాలు మనందరికీ వస్తుంటాయి. అయితే వీటికి ఏదో సాధారణ సమాధానాలు తప్ప శాస్త్రీయ పద్ధతిలో సమాధానాలు ఇప్పటి వరకు లేవు. ఇప్పటి దాకా చేసిన వ్యాయామానికి బరువు చూసుకోవడం తప్ప ఫలితాన్ని గురించి మరో మార్గం లేదు.

అప్పటికీ చేసిన వ్యాయామం మొత్తానికీ ఎంత కెలొరీలు ఖర్చు అయ్యయో చెప్పే యాప్లు ఉన్నాయి కానీ ఒక్కో వ్యక్తికి తగ్గట్టు ఖచ్చితంగా ఫలానా వ్యాయామం చేసేటప్పుడు కొవ్వు కరుగుతోంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు, అది కూడా ఊపిరి ఆధారంగా కొవ్వు కరగడాన్ని అంచనా వేయచ్చు అంటున్నారు స్విట్జర్లాండ్ కు చెందిన పరిశోధకులు.

ETH Zurich మరియు University Hospital Zurich కు చెందిన పరిశోధకుల ప్రకారం మన ఊపిరి ద్వారా బయటకు వచ్చే అణువులను బట్టి మన ఒంట్లో వ్యాయామం చేసేటప్పుడు కొవ్వు కరుగుతోందో లేదో చెప్పవచ్చట. దీని కోసం వీరు ఒక గ్యాస్ సెన్సర్ ను తయారు చేసారు. ఒక బ్రీతలైజర్ కు ఇది అనుసంధానం చేయబడి ఇది పని చేస్తుంది. వ్యాయామం చేసేప్పుడు దీనిలోకి ఆ వ్యక్తి ఊపిరి ఊదితే అతని శ్వాసలో నుండి బయటకు వచ్చే రకరకాల వాయువుల నుండి acetone ను ఈ సెన్సార్ కనిపెడుతుంది. మన ఒంట్లో కొవ్వు కరుగుతోంది అన్న దానికి సంకేతంగా మన ఊపిరి నుండి acetone బయటకు వస్తుందట. అంతే, ఈ acetone ను కనిపెడితే, కొవ్వు కరుగుతున్నదీ లేనిదీ చెప్పవచ్చు అంటున్నారు ఈ బృందoలో ఒకరైన Andreas Güntner. ఈ సెన్సర్ ఎంత ఖచ్చితంగా పని చేస్తుందంటే మన ఊపిరి నుండి వెలువడే కొన్ని వందల రకాల వాయువుల్లో నుండి కొన్ని కోట్ల మాలిక్యుళ్ళ లో ఒక్క acetone మాలిక్యుల్ ఉన్నా ఈ సెన్సార్ acetone ను కనిపెట్టేస్తుందన్న మాట. అంటే దీనర్ధం అసలు ఎర్రర్ కు తావు లేదని. అదీ ఈ సెన్సార్ సామర్ధ్యం.

దీనిని కొంత మంది వాలంటీర్ల మీద పరీక్షించారు. వారు ఒక గంటన్నర పాటు సైక్లింగ్ చేసేప్పుడు నిర్ణీత సమయానికి ఒకసారి ఈ బ్రీతలైజార్లో ఊదమన్నారు. అప్పుడు వారి నుండి ఈ సెన్సర్ ద్వారా సేకరించిన సమాచారం, వారికి చేసిన రక్తం పరీక్షలో వచ్చిన సమాచారం ఒకటే అని తేలింది. అంతే కాదు ఈ సెన్సారు ద్వారా వెయిట్ తగ్గడానికి చేసే lipolysis అనే పద్ధతిలో ఉన్న కొన్ని అపోహలు కూడా తొలగిపోయాయి. ఇది ఎక్కువగా క్రీడాకారులకు ఉపయోగిస్తారు.

ప్రస్తుతం ఈ పరీక్షలో వాడిన సెన్సర్ 1 సెంట్ యూరో నాణెం పరిమాణంలో ఉంటుంది. దీనిని మరింత చిన్న చిప్ రూపంలో విడుదల చేయాలని ఈ పరిశోధక బృందం భావిస్తోంది. ఎందుకంటే ఇంతవరకూ వాడుకలో acetone అనలైజార్లు ఉన్నా ఆ పరికరాలు భారీ పరిమాణంలో ఉండటం, అత్యంత ఖరీదుతో పాటు ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. అదే ఈ సెన్సార్ అయితే రియల్ టైం లో ఫలితాలను చూపించడం, పరిమాణంలో చిన్నది కావడం, ఉపయోగించడానికి అత్యంత సులభంగా ఉండటం దీని ప్రత్యేకత. అందువల్ల ఈ సెన్సార్ ను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయాలని Güntner బృందం భావిస్తోంది.