ఊపిరితిత్తులు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. దీనితో ఒక్కసారి సమస్య వస్తే కొన్ని ఏళ్ల తరబడి వైద్యం కొనసాగాల్సి ఉంది. ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యల వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మరణిస్తున్నారు. ఇది ఏటా HIV బారిన పడి మరణిస్తున్న వారి కంటే నాలుగు రెట్లు ఎక్కువ. సమస్య ఏదైనా మన ఊపిరతిత్తులు సరిగా పని చేస్తున్నాయో లేదో ఒక వైద్యుడే మనకు చెప్పాలి. ఇందుకోసం ఎన్నో సార్లు మనం ఆసుపత్రికి వెళ్ళాల్సి ఉంటుంది.

పట్టణాల్లో ఉన్న వారికి పర్వాలేదు కానీ అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి, పెద్ద వయసు వారికి ఎక్కువసార్లు ఈ సమస్య నిమిత్తం వైద్యుడి దగ్గరకు వెళ్ళాలంటే ఎంతో కష్టం. పల్లె వాసులకు కొన్ని గంటలు ఒక్కో సారి కొన్ని రోజులు సరైన వైద్యం కోసం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సమస్యను గమనించి అమెరికా కు చెందిన పరిశోధకులు ఎవ్వరైనా ప్రపంచంలో ఏ మూల నుంచైనా సరే కేవలం ఒక్క కాల్ ద్వారా తమ ఊపిరి తిత్తుల పని తీరును తెలుసుకోవచ్చు. అది స్మార్ట్ ఫోన్ కావచ్చు, సాధారణ ల్యాండ్ లైన్, పే ఫోన్ ఇలా ఏదైనా సరే కేవలం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే చాలు తమ ఊపిరి ద్వారా వాటి పని తీరును తెలుసుకునే వీలు కల్పించారు ఈ పరిశోధకులు. అదెలాగో చూద్దాం.

University of Washington కు చెందిన Mayank Goel, Shwetak Patel మరియు Elliot Saba మొదలైన వారు 2012లో Spirosmart అనే ఒక యాప్ ను తయారు చేసారు. ఈ స్మార్ట్ ఫోన్ యాప్ లో మన ఊపిరి ద్వారా ఊపిరి తిత్తుల పని తీరు ఎలా ఉందో ఈ యాప్ లోనే చూపించేస్తుంది. అదెలాగంటే, ఈ యాప్ ఓపెన్ చేసి మన ఫోన్ మైక్రో ఫోన్ లోకి బలంగా ఊపిరి వదిలితే, ఈ మైక్రోఫోన్ ఊపిరి వచ్చిన శబ్దం, pressure ను బట్టి ఆ డేటా ను ఒక సెంట్రల్ సర్వర్ కు పంపిస్తుంది. అక్కడ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ద్వారా మన ఊపిరి పని తీరును ఈ యాప్ లో చూపిస్తుంది. అయితే ఇదంతా, స్మార్ట్ఫోన్ మరియు ఇంటర్నెట్ ఉంటేనే సాధ్యం.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని అధిక శాతం జనాభా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగించలేరు.

ఇటువంటి వారి కోసం Goel తన బృందం తో కలిసి ఇండియా మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలు తిరిగి అక్కడి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క సెన్సర్ మన ఫోన్ల లోని మైక్రో ఫోన్ అని తెలుసుకున్నారు. అందువల్ల వీరి కోసం ఈ మైక్రో ఫోన్ ఆధారిత SpiroCall ను తయారు చేసారు. పైన చెప్పిన విధంగా అస్తమా వంటి సమస్యలు ఉన్నవారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఊపిరి దీర్ఘంగా తీసి విడిచి పెడితే చాలు వారి ఊపిరి తిత్తుల పని తీరు ఎలా ఉందో చెప్పేస్తుంది అన్న మాట. ఇదెలా పని చేస్తుంది అంటే, ఫోను లోని మైక్రో ఫోన్, ఊపిరి నుంచీ వచ్చిన శబ్దం మరియు ఒత్తిడి (Pressure) సమాచారాన్ని ఆ ఫోన్ నెట్వర్క్ ను ఉపయోగించి ఒక సర్వర్ కు చేరవేస్తుంది. అక్కడ కొన్ని multiple regression algorithms ను ఉపయోగించి ఊపిరి తిత్తుల పని తీరును అంచనా వేస్తుంది. ఒక ఫోన్ లైన్లో ఎవరికైనా ఒక పాట వినిపించడం ఎలాంటిదో, అలా ఫోన్ లైన్లో ఊపిరి ని అంచనా వేయడం అలాంటిది. అందువల్ల ఈ SpiroCall కోసం అవన్నీ దృష్టిలో ఉంచుకునే ఊపిరిని విశ్లేషిస్తారు.

ఈ SpiroCall ద్వారా వచ్చే ఫలితాలు, వైద్యులు చేసే Spirometry పరీక్ష తో పోలిస్తే కేవలం 6.2 శాతం ఎర్రర్ ను మాత్రమే కలిగి ఉన్నది. ప్రామాణికంగా చెప్పలంటే ఈ error 5 నుంచీ 10 శాతం వరకూ ఉండవచ్చు. అందువల్ల ఇది ఊపిరి తిత్తుల పని తీరును తెలియచేసేందుకు పూర్తిగా ఆమోదయోగ్యమైనదని చెప్పచ్చు.

అంతే కాదు ఈ SpiroCall వినియోగదారుల కోసం ఒక ఈల (3D printed whistle) కూడా తయారు చేసారు. ఎందుకంటే ఈ కాల్ ఊపిరి ఆధారంగా పని చేస్తుంది కాబట్టి వీరికి ఈ ఈల ద్వారా ఎలా ఊపిరి వదలాలో తెలియచేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.

ఇక తదుపరి దశలో ఈ ఫలితాలను వినియోగదారులకు సరళమైన పద్ధతిలో చేరవేయడమే Goel బృందం లక్ష్యం అని వీరు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇది ఇంకా పరిశోధనా దశలోనే ఉంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది అని పేర్కొంది ఈ బృందం.

Courtesy