పిల్లల్లో వినికిడిని గూర్చి అంతగా పట్టించుకోరు పెద్దలు. పిలిస్తే పలుకుతున్నారు కదా, ఇంకేం ఉంది అనుకుంటారు. కానీ వినికిడి లోపం వల్ల బడిలో ఉపాధ్యాయులు చెప్పేది సరిగా అర్ధం కాక చదువులో వెనకబడతారు. చివరికి ఫలానా విద్యార్ధికి వినికిడి తక్కువ ఉంది అని ఉపాధ్యాయులు చెబితే తప్ప చాలా మంది తల్లిదండ్రులకు వారి బిడ్డల సమస్య అర్ధం కాదు. తీరా వైద్యుని దగ్గరకు వెళ్ళే సరికి ఆలస్యం అయిపోతుంది. ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. బిడ్డ పుట్టినప్పుడు చెవిని పరీక్షిస్తారు కదా, అప్పుడేం లేకపోతే ఊపిరి పీల్చుకోవచ్చా అనుకుంటారు. కానీ ఇది తప్పు. వినికిడి సమస్య ఏ వయసులోనైనా తలెత్తవచ్చు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా విధిగా తమ వినికిడిని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

ఆస్ట్రేలియా లో జరిగిన SXSW Accelerator పోటీలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, సాంకేతిక రంగాలలో కొత్త కొత్త ఆలోచనలతో, ఉత్పత్తులతో వస్తున్నా స్టార్ట్ అప్ సంస్థలు పోటీ పడతాయి. ఈ సంవత్సరం, Sound Scouts కు Health and Wearable Technology Award 2017 అవార్డు దక్కింది. ఇంతకీ ఏమిటా పోటీ అనుకుంటున్నారా. మీకు ఆ పోటీ తెలియకపోవచ్చు కానీ దాని ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన సంస్థలు Siri, Pinterest, Twitter కూడా ఈ వేదిక నుంచే ప్రపంచానికి పరిచయం అయ్యాయి. సరే, మరి ఈ Sound Scouts గురించి తెలుసుకుందాం.

ఇది ఒక యాప్ ద్వారా లభించే ఒక ఆట. ఈ యాప్, ఈ సంస్థ స్థాపకురాలైన Carolyn Mee మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం వారి హియరింగ్ రీసెర్చ్ ల్యాబ్ (hearing research lab) – the National Acoustic Laboratories, రెండూ సమిష్టిగా చేసిన ఐదేళ్ళ కృషి ఫలితం. ఈ Sound Scouts సామర్ధ్యాన్ని గుర్తించి ఆస్ట్రేలియా లోని NSW (New South Wales) ప్రభుత్వం దీనికి సహాయాన్ని అందిస్తోంది. ఈ Sound Scouts ప్రస్తుతం ఆస్ట్రేలియా లో గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యం అవుతోంది. అయితే త్వరలోనే దీనిని అమెరికా లో కూడా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇది ఎలా పని చేస్తుంది అంటే ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, తమ పిల్లలను పక్కన కూర్చోపెట్టుకుని పెద్దలు ఇందులో ఉండే ట్రయల్ గేమ్ ఆడాలి. అన్నిటికీ మించి ప్రశాంతమైన గదిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆడటం తప్పనిసరి. ఇక ఈ గేమ్ సుమారు 15 నిముషాలు నిడివి కలిగి ఉంటుoది. అందుచేత పిల్లలను ఆ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఇక ట్రయల్ గేమ్ ఆడి చూసిన తరువాత పెద్దలు అందులోని సూచనలను పిల్లలకు ముందుగా చెప్పి, పిల్లలతో ఈ ఆట ఆడించాలి. ఆట కాబట్టి పిల్లలు ఇష్టంగా ఆడతారు. అయితే ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఆట వేగంగా ఆడటం కంటే సరిగ్గా ఆడటం ముఖ్యం.

ఇక ఆట అయిపోగానే అందులో రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ కు పిల్లల వినికిడి విశ్లేషణ అంతా వచ్చేస్తుంది. ఒక వేల అందులో ఏదైనా తేడా ఉంటే, వైద్యుడిని సంప్రదించవచ్చు.

ఇప్పటికే ఈ యాప్/ఆట ఆస్ట్రేలియా లోని ఎంతో మంది పిల్లలలోని వినికిడి లోపాలను ముందుగానే తెలియచేస్తోంది. ఒక వినూత్న రీతిలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేలా రూపొందించినందుకు ఈ సంస్థకు అభినందనలు చెప్పాల్సిందే కదూ.