మన నిత్య జీవితంలో మనం వాడే ఎన్నో వస్తువులు అసలైనవే అని మనం చెప్పలేం. అందులోనూ ముఖ్యంగా ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్లు వచ్చాక బయట మార్కెట్లో కంటే ఇందులో చాలా తక్కువ ధరకే వస్తువులను అమ్ముతుండడం మనం చూస్తుంటాం. అందులో అసలు కన్నా నకిలీనే ఎక్కువ. ఇలా ఒకటేమిటి, బట్టలు మొదలుకుని బంగారం, ఆటో భాగాలు, మందులు ఇక ఆ పైన పాస్పోర్ట్, కరెన్సీ వరకు నకిలీ ఏదో కనిపెట్టడం సామాన్య వినియోగదారుడికి సాధ్యం కాదు.

మొన్నటికి మొన్న మన దేశంలో కరెన్సీ మారగానే దానికి సైతం కొద్ది రోజులలో నకిలీలు ప్రత్యక్షం అవ్వడం మనం చూసాం. దాని వల్ల నష్టపోయేది వినియోగదారుడే కాదు ఆయా పరిశ్రమలు సైతం నష్టపోతున్నాయి. ఫలితంగా యావత్ దేశ ఆర్ధిక ప్రగతినే కుంటుపడేలా చేస్తుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని వందల వేల కోట్లు ఈ నకిలీల వల్ల నష్టపోతున్నాం.

ఒక్కో వస్తువు అసలైనదో కాదో తెలియాలంటే ఆ వస్తువు తయారీదారుడో లేక అందులో నిష్ణాతుడో చెప్పాల్సిందే. అందువల్ల సామాన్యులు జబ్బులకు సైతం అసలైనవనుకుని ఈ నకిలీ మందులు కొనుక్కుని రోగాలు తగ్గక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని దేశాల్లో ఎన్ని చట్టాలు చేసినా ఎంత కట్టుదిట్టంగా అమలుపరిచినా చాప కింద నీరులా అన్ని రంగాల్లో పాతుకుపోయిన ఈ నకిలీలను అడ్డుకోలేకపోతున్నారు. ఈ జటిలమైన సమస్యకు UK లోని Univeristy of Lancaster కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ Robert Young పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే ఈ Atomic Fingerprint.

అంటే పేరుకు తగ్గట్టే ఇందులో అణువుల యొక్క ప్రింట్ ఉంటుందన్నమాట. ఈ ప్రక్రియలో రెండు భాగాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన అణుక్రమాన్ని ఒక hologram లేబిల్ గా తయారు చేసి ఆ వస్తువులకు అంటించడం. మరొకటి ఈ లేబిల్ ను విశ్లేషించే యాప్. అప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ కెమెరా ఫ్లాష్ ద్వారా ఆ లేబిల్ ను కనిపెట్టడంతో అసలేదో నకిలీ ఎదో తెలుస్తుంది. సరే, ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే చాలా సన్నని graphene oxide మీద దాన్లోని అణువులను అటూ ఇటూ చేయడం లేదా మార్చడం, మరొక అణువును జోడించడం వంటిది చేస్తారు. ఈ అణుక్రమాన్ని inkjet ప్రింటర్ ద్వారా ఒక హోలోగ్రాo లా తయారు చేసి వస్తువుకు అంటిస్తారు. ఇక ఆ లేబిల్ ను ఒక స్మార్ట్ ఫోన్ కెమెరా ఫ్లాష్ ఫోకస్ చేస్తే ఆ లేబిల్ మీద అణువులు ఉద్దీపనం (excite) చెంది ఒక రంగును చూపిస్తుంది. ఇక దీని కోసం రూపొందించిన యాప్ ద్వారా ఆ అణుక్రమానికి అణుగుణమైన రంగును చూపిస్తే అది అసలు వస్తువు కింద లెక్క.

ఈ పద్ధతిలో వినియోగదారుడు చేయాల్సింది కేవలం లేబిల్ మీద ఫ్లాష్ ఫోకస్ చేసి, యాప్ ద్వారా అది సరైనదో కాదో చూసుకోవడమే. ప్రస్తుతం Young బృందం ఈ పద్ధతిని అందుబాటులోకి తెచ్చేందుకు సంవత్సరానికి 10 బిలియన్ హోలోగ్రాo లను తయారు చేసే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దానిని మొట్ట మొదటగా ఆటో పరిశ్రమలో దొరికే వస్తువుల మీద ఉపయోగించనున్నారు. అలా వచ్చే సంవత్సరం 2018 నాటికల్లా Robert Young రూపొందించిన పద్ధతి అమల్లోకి రానుంది. ఇలా ఒకటేమిటి అన్ని పరిశ్రమల్లోకి ఈ విధానాన్ని అమలు పరిచే ఉద్దేశంలో ఉన్నారు Robert Young.

Courtesy