మానవ శరీరానికి ఏమైనా గాయమైతే అది మానడానికి చాలా సమయమే పడుతుంది. అది కూడా సరైన వైద్యం, బలవర్ధకమైన ఆహారం, నియమాలు పాటిస్తే, ఆ గాయం తీవ్రతను బట్టి ఎప్పటికో తగ్గుతుంది. కానీ అదే ఆ దెబ్బ తగిలిన అవయవం పని చేయకపోతే, గాయం తగ్గడం మాట పక్కన పెట్టి అది మరింత అనారోగ్యానికి దారి తీస్తుంది. ఈ పైన చెప్పిన రెండూ రెండు భిన్నమైన దారులు. కానీ ఏది ఏమైనా సరే, ఒక్క స్పర్శతో గాయం తగ్గిపోతుందా. అంటే, సినిమాల్లో అయితే ఏదో మంత్రం వేయగానే తగ్గిపోతుంది. కానీ మాయా కాదు మంత్రం లేదు, ఈ చిప్ తగిలించుకుంటే ఎలాంటి గాయమైనా తగ్గిపోతుంది అంటున్నారు Ohio State University (OSU) పరిశోధకులు.

ఈ OSU పరిశోధకులు ఒక నమూనా చిప్ ను తయారు చేసారు. ఈ పద్ధతిలో శరీరానికి సంబంధించిన గాయాలను మాన్పవచ్చు. ఈ పద్ధతిని Tissue Nano Transfection (TNT) అంటారు. ఈ చిప్ ను ఒక్కసారి ఒంటికి తగిలించుకుని దానికి కొద్ది పాటి కరెంటు ఇవ్వగానే, ఈ చిప్ లోని జన్యువులు చర్మం కిందకు చొచ్చుకుని పోయి, కొత్త కణాలను తయారు చేసుకుంటుంది. అవి గాయం మాన్పడానికి సహకరించే విధంగా సదరు అవయవాన్ని సిద్ధం చేస్తుంది. ఉదా. కాలికి పెద్ద గాయమైంది అనుకుందాం. కానీ ఆ గాయo తగ్గడానికి అవసరమైన అవయవం కూడా దెబ్బ తింది అనుకుందాం. అప్పుడు ఈ చిప్ ను వైద్యులు గాయం మానడానికి అవసరమయ్యే జన్యువులతో నింపి శరీరం మీద అంటించగానే ఇవి శరీరంలోకి చేరి సహజంగా అవసరమయిన కణాలను తమంత తామే ఉత్పత్తి చేసుకుని గాయం మానేట్టు చేస్తుందన్న మాట. అంటే వైద్యానికి శరీరం విఫలం అయితే, ఆ మేర అవసరమైన కణజాలాన్ని శరీరమే తయారు చేసుకునేట్టు సహకరించడం అన్న మాట.
ఈ చిప్ ను ఇప్పటిదాకా మనుషుల మీద ప్రయోగించలేదు. ఇప్పటిదాకా ఈ చిప్ ను జంతువుల మీద చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయి. ఒక కాలికి గాయమైన ఎలుకకు ఈ చిప్ ను వేయగా, రెండవ వారానికల్లా గాయం చాలా వరకు మాని, కాలు తీసేయాల్సిన అవసరం తప్పిందని అంటున్నారు చందన్ సేన్. ఈయన ఈ పరిశోధనలో ఒకరు.

ఇప్పటికే ఈ తరహా ప్రోగ్రామింగ్ స్కిన్ సెల్స్ మీద పరిశోధనలు జరుగుతున్నా, ఈ TNT చాలా సరళంగా, సులభంగా ఉండటం, దీనితో మరో సైడ్ ఎఫెక్ట్ వంటివి లేకపోవడం ఈ TNT ప్రత్యేకత. అన్నిటికంటే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శరీరంలోకి ఎదో ఎక్కిస్తున్నారు అది ఏంటి అంటే, మన శరీరంలో కణాలనే రీప్రోగ్రాం చేసి తిరిగి ఎక్కిస్తున్నారు అన్న మాట.
ఈ పద్ధతిలో మానవ ప్రయోగాలు ఇప్పుడిప్పుడే మొదలు కానున్నాయి. ఈ TNT పద్ధతి అందుబాటులోకి రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుందంటున్నారు పరిశోధకులు.

ఏది ఏమైనా దీనితో చాలా వైద్య ప్రయోగాలను నెరవేర్చుకోవచ్చు అంటున్నారు చందన్ సేన్.

Courtesy