గత వారం మనం అమెరికా లోని లాస్ వేగాస్ లో జరిగిన CES (Consumer Electronics Show) 2017 ప్రదర్శనలో కొన్ని అద్భుతమైన గాడ్జెట్ల వివరాలు చూసాం. ఈ రోజు మరిన్ని గాడ్జెట్ల వివరాలు చూద్దాం. సరే ఈ రోజు కొన్ని రోబోట్లు, హెల్త్ గాడ్జెట్లు ఇంకా టొయోట సంస్థ వారి ఒక కాన్సెప్ట్ కార్ గురించి చెప్పుకుందాం.

Kuri: ఈ ప్రదర్శనలో చాలానే రోబోట్లు వివిధ పనులకు రూపకల్పన చేయబడినవి పోటీ పడ్డాయి. వాటిలో Lynx మొదలైనవి ఉన్నా ఈ Kuri అనే పేరు గల రోబోట్ కొంచెం ప్రత్యేకమనే చెప్పాలి. దీనిని Mayfield Robotics అనే సంస్థ రూపొందించింది. ఇది ఆ సంస్థ వారి మొట్ట మొదటి ఉత్పత్తి. మిగతా రోబోట్లకంటే ఇది కొంచెం ప్రత్యేకం ఎందుకంటే మిగతా వాటిలా ఇది వాయిస్ కమాండ్లకు స్పందించినా ఇది మాటలతో సమాధానం చెప్పదు. అంటే ఇది మనకు స్పందించింది అనడానికి గుర్తుగా లైట్లు వెలగడం, అలాగే కళ్ళతో నవ్వడం వంటివి ఈ Kuri లో మనల్ని ఆకర్షించే విషయం. ఈ రోబోట్ 20 అంగుళాల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి మూడు చక్రాలు కలిగి ఉంటుంది. ఇక దీని బరువు 6.3 కేజీలు. దీనిలో 4 మైక్రోఫోన్ array ఉన్నది. తద్వారా గదిలో మనం ఏ మూలాన ఉన్నా దీని వినిపిస్తుంది అన్నమాట. అలాగే దీనిలో HD కెమెరా, సెన్సర్లు, లేసర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. అంతే కాదు ప్రస్తుతం ఇది ఇంట్లో నలుగురు వ్యక్తులను గుర్తు పట్టగల facial recognition సిస్టం కలదు. ఇక యాప్ ద్వారా ఇది మన ఫోను (iOS లేదా ఆండ్రాయిడ్)లకు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. ఇది ఇల్లంతా తిరుగుతూ ఇంటిని కనిపెట్టుకుని ఉంటుంది. దీనిలో ఉండే లేసర్ బ్లూప్రింట్ వల్ల ఇది మన ఇళ్ళు ఎలా ఉంటుందో, గదులు ఎక్కడెక్కడ ఉన్నాయో, అందులో ఫర్నిచర్ ఎలా ఉంటుందో దీనికి తెలుసన్నమాట. ఎప్పుడైనా ఏదైనా తేడా వస్తే వెంటనే ఫోటోలు తీసి మన ఫోనుకు పంపిస్తుంది. అలాగే మన ఇంట్లో కుక్క కనుక సోఫా ఎక్కి కూర్చుంటే మనకు మెసేజ్ చేస్తుంది, దీనిలోని స్పీకర్ల ద్వారా ఆ రోబోట్లోంచి మనం అరిచి ఆ కుక్కను అదిలించవచ్చు. ఇంకా మరెన్నో స్మార్ట్ హోం అప్లికేషనులతో ఇది ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది అంటున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. ఇక దీని ధర $700.

Jewel: ఇంత వరకు మనం స్మార్ట్ వాచ్ ల వంటి ఫిట్నెస్ ట్రాకర్లను చూసాం. వాటితో విసుగెత్తిన వారు ఇంచుమించి అదే ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ రింగ్ ను పెట్టుకోవచ్చు. ఇది మన గుండె చప్పుడు, మన వ్యావాయ వివరాలు, కరిగించిన కెలొరీలు, మన నిద్ర కు సంబంధించిన వివరాలతో సైతం మనకు చెప్పేస్తుంది. ఇది ఒక ఉంగరంలా నిత్యం మనం పెట్టుకుంటేనే ఇది పని చేస్తుంది (అంటే సరైన సమాచారం ఇస్తుంది). ఇది అల్ట్రాలైట్ టైటానియం తో తయారు చేయబడి చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. చివరగా ఇది వాటర్ప్రూఫ్ కూడా.

Concept i: టొయోట సంస్థ వారు CES 2017 లో ఒక ప్రత్యేకమైన కార్ కాన్సెప్ట్ ను ప్రదర్శించారు. ఇప్పటికే అటానమస్ కార్లు (డ్రైవర్లెస్ ఆటోమేటిక్ కార్) అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం వీటి వాడకం అంత ఎక్కువ లేకపోయినా 2030 నాటికి ఇలాంటి ఒక కార్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఊహతో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. సరే, ఇది డ్రైవర్లెస్ కార్ మాత్రమే కాకుండా ఇది మన మూడ్ కు తగ్గట్టు నడచుకోవడం విశేషం. అంటే మన మూడ్ బాలేనప్పుడు ఏదైనా బీచ్ రోడ్లోకి తీసుకు వెళ్ళడం, మరో వ్యక్తితో మన సంభాషణను బట్టి ఫలానా చోటుకు తీసుకువెళ్ళడం వంటివన్నమాట. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ఊహ అయినా ఏమో కొన్ని దశాబ్దాల తరువాత ఇలాంటి కార్లు సాధారణం అయిపోవచ్చేమో.