ఆరోగ్యమే మహా భాగ్యం. కానీ ఆ భాగ్యం అందరికీ ఉండదుగా. అందుకే కొందరు జబ్బు పడుతుంటారు. ఫలితం డాక్టర్ల చుట్టూ తిరిగి వైద్యం చేయిoచుకోవడం. వైద్యులు ఫలానా మందులు అయితే ఇస్తారు కానీ దానిని ఖచ్చితంగా సమయానికి వేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడే వచ్చింది చిక్కంతా. ప్రపంచంలో సగానికి పైగా జనాలు ఇచ్చిన మందులు సరిగా సూచించిన ప్రకారం వేసుకోరు. అలా కొన్నాళ్ళ పాటు ఒక నిర్ణీత సమయానికి మందు వేసుకుంటేనే కానీ మందులు పని చేయవు. ఎందుకంటే dosage సరిగ్గా పడకపోతే మందులు పని చేయవు కాబట్టి. మలేరియా, హెచ్ఐవి, మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని రోగాలకు దీర్ఘ కాలం మందులు వాడితే కానీ తగ్గవు.

అలా అని మనం ఎవరినీ తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే దీర్ఘ కాలం మందులు గుర్తు పెట్టుకుని వేసుకోవడం కొంచెం కష్టమే. అందుకే ఎంతో మంది పరిశోధకులు మరింత సమర్ధవంతమైన డ్రగ్ డెలివరీ విధానాల కొరకు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే MIT (Massachussetts Institute of Technology) కి పరిశోధకులు Giovanni Traverso సుమారు రెండు వారాల పాటు పని చేసే ఒక కాప్సుల్ ను తయారు చేసారు. అంటే దీనిలో రెండు వారాలకు తగ్గ మందు ఉందన్నమాట. సరే ఇంతకీ అదెలా పని చేస్తుందో చూద్దాం.

ఈ కాప్సులే చూడడానికి మామూలు కాప్సుల్ లానే ఉంటుంది. దీనిని ఒకసారి నోట్లో వేసుకుని మింగితే కడుపులోకి వెళ్ళాక కడుపులోని ఆమ్లాల వల్ల దీని పైన ఉన్న పొర పోయి అసలైన మందు బయటకి వస్తుంది అన్నమాట. అది చూడడానికి నక్షత్రాకారంలో ఉంటుంది. ఇదే ఇక్కడ కీలకం. ఈ ఆరు భాగాలు కలిగిన ఈ నక్షత్రాకారంలో మందు ఉంటుంది. దీని వల్ల ప్రయోజనం ఏంటంటే ఈ ఆకారం వల్ల ఇది మిగతా వ్యర్దాలతో పాటు బయటకి పోదు. పైగా ఒక్కో భాగం ప్రత్యేకమైన పరిమాణం, తయారు చేయబడిన పదార్ధం, అందులో ఉన్న మందును బట్టి మందు విడుదల అయ్యి ఒక్కో భాగం కరిగిన తరువాత అంటే అలా మందు మొత్తం సుమారు రెండు వారాల పాటు పని చేసిన తరువాత అది శరీరం నుంచి వ్యర్దాలతో బయటకి వెళ్లి పోతుంది.

ఇలా ఈ పద్ధతిలో మరిన్ని కాప్సుల్స్ ను తయారు చేసే పనిలో Giovanni ఉన్నారు. ఇలాంటి కాప్సుల్స్ అవసరం వృద్ధులకు, ఇంకా నిత్య జీవితంలో పని ఒత్తిడి ఎదుర్కొనే వారికి, మతి మరపు కలవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు కదూ.