నేటి కాలంలోని విద్య, ఉపాధి కారణాల దృష్ట్యా ఇంట్లో పిల్లలు కావచ్చు యుక్త వయసు వారు కావచ్చు, ఇళ్ళు వదిలి ఎక్కడెక్కడో పని చేస్తున్నారు. ఇక వారి కంటూ ఒక కుటుంబం ఒక ఉద్యోగంలో స్థిర పడ్డాక ఇంట్లోని తల్లిదండ్రులను విడిచి ఉండాల్సి వస్తోంది. పెద్ద వయసు వచ్చిన తల్లిదండ్రులు బిడ్డల దగ్గర ఉండలేరు, అలాగే పిల్లలూ తమ జీవితాలు వదిలేసుకుని తమ కన్నవాళ్ళతో ఉండలేని పరిస్థితే ఇప్పుడు అందరిదీ. అలాంటప్పుడు పెద్ద వారికి ఆరోగ్యం బాగుంటే పర్వాలేదు, అదే వారు కూడా వ్రుద్దులై అనారోగ్యంతో ఉంటే వారిని ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది.

ఈ అవసరం లోంచి పుట్టిందే ఈ KrayDel అనే యాప్. ఇది ఇంట్లో ఉండే పెద్ద వయసు వారి కోసం రూపొందించబడింది. దీని ద్వారా తమ బిడ్డలు పెద్దవారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ KrayDel ఒక మానిటర్ మరియు హబ్ అనే రెండు భాగాలు కలిగి ఉంటుంది. దీనిని ఒకటి వారి తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో పెట్టుకుంటే చాలు, ఇది తమ బిడ్డల ఫోన్లో మరియు TV లో సైతం వారి గురించిన సమాచారాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఇది ఇంట్లో ఉన్న వ్యక్తి కదలికలను కనిపెడుతూనే ఉంటుంది. అలా ఒక వారం గడిచాక ఇది ఆ వ్యక్తికి రోజూ వారీ పనులేంటి, వారి ప్రవర్తన ఎలా ఉంది అనే విషయం గ్రహించేస్తుంది. ఉదా. సాయత్రం మొక్కల పని కోసం వెళ్ళిన పెద్దాయన ఇంకా రాలేదు అనుకోండి వెంటనే ఇది వారి బిడ్డలకు సమాచారం ఇచ్చేస్తుంది.

అంతే కాదు దీనికి అనుబంధంగా ఉండే రిస్ట్ వాచ్ పెట్టుకుంటే ఇది ఆ పెట్టుకున్న పెద్ద వారి యొక్క ఉష్ణోగ్రత, హార్ట్ బీట్, ప్రవర్తన, ఎక్కడైనా పడ్డారా, లేక వారు ఇంటి నుంచీ దూరం వెళ్ళిపోయి ఇంటి దారి తెలియక ఇబ్బంది పడుతున్నారా అనే విషయం కూడా గ్రహించేస్తుంది. అంతెందుకు ఇంట్లోని వారి సాధారణ ప్రవర్తనకు మించి భిన్నంగా ఏం జరిగినా ఇది వారి బిడ్డలకు సమాచారం ఇచ్చేస్తుంది. అంతే కాదు ఈ మానిటర్ ద్వారా తరచుగా వీడియో కాల్ కూడా చేసి ఇంట్లోని పెద్దల గూర్చి తెలుసుకుంటూ ఉండ వచ్చు. ఇంటర్నెట్, ఫోన్ లాంటి చిన్న స్క్రీన్లు చూడలేని పెద్ద వారికి ఇది వాడడానికీ, చూడడానికీ తేలిగ్గానే ఉంటుంది. ఈ సమాచారం అంతా ఈ hub ద్వారా బిడ్డల ఇంట్లోని TV లో ఒక రిమైండర్ లాగా కనిపిస్తూనే ఉంటుంది.

అయితే ఇది ప్రస్తుతం ఒక ప్రూఫ్ అఫ్ కాన్సెప్ట్ మాత్రమే. దీనిని వృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంది అని దీని రూపకర్తలు పేర్కొన్నారు. ఈ కాలంలో ఇంట్లోని పెద్దలను నిరంతరం కనిపెడుతూ ఉండే ఇలాంటి ఒక పరికరం ఎంతైనా ఉంది. ఇలాంటి వర్చ్యువల్ అసిస్టెంట్ లను మరింత ఉపయోగకరంగా చౌకగా తయారు చేస్తే మంచిది.