ఒకప్పుడు వైద్య పరీక్షలు అంటే, అది ఏమైనా సరే రక్తం, మూత్రం ఇలా ఇంకేదైనా సరే ప్రాధమిక రోగ నిర్ధారణ కోసం ఒక ల్యాబ్, అందులో శిక్షణ పొందిన సిబ్బంది ఇలా ఉండేది పరిస్థితి. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చాక పరిస్థితి మారిపోయింది. అన్ని డయాగ్నొస్టిక్ పరీక్షలు, స్మార్ట్ ఫోన్ వాడటం వస్తే చాలు చేసుకునే వీలు కల్పిస్తోంది ఈ స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని పెద్ద పెద్ద ఫార్మా, వైద్య సంస్థలన్నీ తమ సేవలను ఎలా ఈ అరచేతి పరికరంలోకి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాయి. దాంతో ఇప్పటికే తలో జబ్బు నిర్ధారణ కోసం తలో పరికరం, దానికి తగ్గ యాప్ లు మార్కెట్లోకి వచ్చేసాయి. అలా డయాబెటిస్, మలేరియా, టీబి, కంటి పరీక్షల దాకా ఇంకా ఎన్నో రోగాలను నిర్ధారించే డయాగ్నొస్టిక్ పరీక్షలు స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేసాయి.

అయితే వీటితో ఇబ్బంది ఏంటంటే ప్రతీ పరీక్షకు, ఒక్కో పరికరం, దానికి తగ్గ యాప్ వాడటం చేయాల్సి ఉంటుంది. అదే ఒకే వ్యక్తికి కానీ కుటుంబంలోని పలువురికి బహు విధాలుగా ఉపయోగపడాలంటే వారు ఒక్కో జబ్బుకు ఒక్కో పరికరం కొనాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. అందువల్ల కొన్ని రకాల పరీక్షలను ఒక్క పరికరంతో చేసుకునే విధంగా మన ముందుకు వచ్చింది Inito. మన దేశానికి చెందిన Samplytics అనే సంస్థ స్మార్ట్ ఫోన్ ఆధారంగా ఒకే పరికరంతో పలు రకాల డయాగ్నొస్టిక్ పరీక్షలను ఇంట్లో చేసుకునే వీలు కలిపించింది. అదే ఈ Inito.

ఈ సంస్థ ఒక పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పరికరానికి అనుసంధానంగా Inito అనే యాప్ పని చేస్తుoది. అంతే, ఈ పరికరాన్ని మన స్మార్ట్ ఫోన్ కు తగిలించుకుని, ఏ పరీక్ష కావాలంటే ఆ పరీక్షను ఈ యాప్ లో సూచనలు పాటిస్తూ చేస్తే, ఫలితం కూడా 5 నిముషాల్లో చెప్పేస్తుంది. ఈ Inito తో డయాబెటిస్, హార్మోన్ అసమతుల్యం, fertility సమస్యలు, కొలెస్ట్రాల్ ఇలా పలు జబ్బులకు సంబంధించిన డయాగ్నొస్టిక్ పరీక్షలు చేసేసుకోవచ్చు. అదెలాగో పై వీడియో లో చూడండి.

ఈ Inito తో మూత్రం, రక్తం, ఉమ్మి తో చేసే డయాగ్నొస్టిక్ పరీక్షలు చేసుకోవచ్చు. అయితే ఒక్కో జబ్బుకు ఒక్కో టెస్ట్ స్ట్రిప్స్ మాత్రం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థ మొట్ట మొదట Inito Fertility Monitor ను ప్రవేశ పెట్టింది. అంటే, పేరుకు తగ్గట్టు fertility సమస్యలను, అసమతుల్యాన్ని ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తుందన్న మాట. అంతే కాదు, ఈ యాప్ లో పరీక్ష ఫలితాన్ని సేవ్ చేసి ఒక్కో వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సంగ్రహపరుస్తుంది. ఈ పరికరంతో ఇప్పటికే చేసుకునే పరీక్షలను మినహాయించి ఇంకా దీనితో థైరాయిడ్, vitamin D లోపం మొదలైన సమస్యలను కూడా ఈ Inito గుర్తించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ పరికరం ధర కేవలం 3500 రూపాయలు. అయితే ఫెర్టిలిటీ టెస్ట్ స్ట్రిప్స్ ధర 1000 రూపాయలు, మిగతా టెస్ట్ స్ట్రిప్స్ ధర వేరుగా ఉంటుంది. మొత్తానికి ఇంటిల్లిపాదికీ ఉపయోగపడే ఫ్యామిలీ ప్యాకేజ్ లా ఉంది కదూ. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బహు వైద్య ఉపయోగాలను కలిగించే పరికరాల అవసరం ఎంతైనా ఉంది.