ఈ టైటిల్ చదివి నేను దేన్నో తిడుతున్నాను అనుకోకండి. ఈ రోజు ఒక చెత్తను ప్రక్షాళన చేసే పరికరం గురించి తెలుసుకుందాం.

చెత్త. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక జటిలమైన సమస్య. మన నిత్య జీవనంలో ఉత్పన్నమయ్యే చెత్త రోజు రొజుకూ పెరుగుతోందే తప్ప తరగడం లేదు. ఈ చెత్తను ప్రక్షాళన చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నా, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సరిగ్గా అమలు చేయడం లేదు. రోడ్లకిరువైపులా, ఖాళీ స్థలాల్లో, చెరువుల్లో చెత్తను పారేయడం వల్ల నీరు, గాలి, భూమి కలుషితం అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో ఇజ్రాయిల్ లోని ఒక సంస్థ “హోం బయోగ్యాస్” (Home Biogas) ను రూపొందించింది. ఇది చెత్తను శుద్ధి చేసే ఒక మిషను వంటిది. దీనికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. దీనిని ప్రత్యేకించి వెనకబడ్డ వర్గాల కోసం తయారు చేయడం వల్ల దీనికి వేరే ఇంధనం, లేదా పవర్ కనెక్షన్ అవసరం లేకుండా దానంతట అదే పని చేస్తుంది. ఇది చూడటానికి ఒక వాషింగ్ మిషను అంత వుంటుంది. దీనిలో మన ఇంటిలోని ఆర్గానిక్ చెత్తను…అంటే ప్లాస్టిక్, స్టీల్, ఇనుము వంటివి మినహాయించి పేపరు ఇంకా మన ఇంటిలో తిరిగే జంతువుల వ్యర్ధాల వరకు అన్నీ వేయచ్చు. ఈ మిషను, ఈ చెత్త నుంచి బయోగ్యాస్ ను తయారు చేస్తుంది.

Biogas_1

ఈ బయోగ్యాస్ ఎలా వస్తుందో సూక్ష్మంగా తెలుసుకుందాం. సహజంగా ఈ ఆర్గానిక్ చెత్త లో వుండే బాక్టీరియా ఆక్సిజన్ లేనప్పుడు దీనిని మీథేన్ మరియు CO2 కింద విడగొట్టేస్తుంది. అదే బయో గ్యాస్. ఈ ”బయోగ్యాస్” ను వంట కోసం వాడుకోవచ్చు. ఈ ప్రక్రియలో బైటికి ఎటువంటి చెడు వాసన రాకుండా వుండడం దీని ప్రత్యేకత. ఇందులో చివరగా మిగిలే వ్యర్ధాన్ని చెట్లకు ఎరువుగా వాడుకోవచ్చు. ఇది ఇంటింటికీ లభ్యమయ్యే వస్తువు కావడం వల్ల ఎవరికి వారు ఎప్పటికప్పుడు వారి ఇంట్లోనే చెత్తను ప్రక్షాళన చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ లోని మారుమూల ప్రాంతాల్లో కనీసం వంట గ్యాస్ సౌకర్యం కూడా లేదు. అటువంటి వారికి ఇది శుభవార్త.

Biogas_3

దీనిని కేవలం ఇజ్రాయిల్ లోని వారి కోసం తయారు చేసినా, దీని నుంచి మనం నేర్చుకోవలసింది చాలా వుంది. చెత్తను ప్రక్షాళన చేయడం ఏ ఒక్క సంస్థకో పరిమితమైన పని కాదు. ప్రతీ ఒక్కరిదీ. అత్యధిక జనాభా గల ఈ దేశంలో ఇంటింటికీ ఇటువంటి బయోగ్యాస్ మిషన్ల ఆవశ్యకత వుంది. వీటిని మన అవసరాలకు తగ్గట్టు మార్పులు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలి ఆశిద్దాం. అప్పుడే మన దేశం ఇంధన స్వతంత్ర దేశంగా అవతరిస్తుంది.

Courtesy