స్కిన్ కాన్సర్ చాలా ప్రమాదకరమైన జబ్బు. ఇది ఎందుకు ఎలా ఇప్పుడు ఎవరికి వస్తుందో కూడా చెప్పలేము. ప్రపంచవ్యాప్తంగా ఏ వయసు వారికైనా చిన్న పిల్లలకైనా, పెద్ద వారికైనా ఇది వచ్చే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే అమెరికాలో ప్రతీ 52 నిముషాలకు ఒకరు ఈ మెలనోమ (స్కిన్ కాన్సర్) వల్ల చనిపోతున్నారంటే దీని త్రీవ్రత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. దీనికి మూలం చర్మం మీద వచ్చే మచ్చలు. అవి సాధారణ మచ్చలే అయితే పర్వాలేదు, కానీ అవి కాన్సర్ కు ఆరి తీయకుండా ఉండాలి.

మామూలు మచ్చలకు, కాన్సర్ కారణంగా ఏర్పడే మచ్చలను ఎలా గుర్తించాలి. అక్కడే అసలు సమస్య వచ్చేది. ఎందుకంటే, అసలు ఎక్కువ మందికి ఇలాంటి ఒక జబ్బు ఉంటుందని, శరీరంలో మచ్చలు దాని ఫలితమనీ చాలా మందికి తెలియక వాటిని వైద్యుడికి చూపించడంలో అశ్రద్ధ చేస్తుంటారు. దాంతో పరిస్థితి చేయి దాటిపోతుంది అంటున్నారు వైద్యులు. శరీరం మీద మచ్చలు వస్తుంటే అవి ఎక్కువ కాలంగా ఉంటూ ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం అవసరం. అయితే స్కిన్ కాన్సర్ ను గుర్తించడానికి చేసే పరీక్షలు చాలా ఖరీదుతో కూడుకున్నవి, పెద్ద పెద్ద పరికరాలతో చేయాల్సిన పరీక్షలు ఇలా ఉంటాయి. కానీ స్కిన్ కాన్సర్ ను గుర్తించడానికి ఇప్పుడు అవేవీ అవసరం లేదు. కేవలం ఒక పెన్ను కంటే కొంచెం పరిమాణంలో ఎక్కువ ఉన్న ఈ పరికరం ద్వారా స్కిన్ కాన్సర్ ను కనిపెట్టవచ్చు అంటున్నారు Cody Simmons, CEO DermaSensor. ఇంతకీ దీని కధేంటో చూద్దాం.

DermaSensor అనేది అమెరికా లోని మియామి కి చెందిన ఒక హెల్త్ స్టార్ట్ అప్ సంస్థ. వీరు స్కిన్ కాన్సర్ ను కనుగొనడానికి ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ (AI) ఆధారంగా పని చేసే ఒక పెన్నును రూపొందించారు. ఇది ఎలా పని చేస్తుందంటే, చర్మo మీద ఏర్పడే ఎలాంటి మచ్చల మీదనైనా ఈ పెన్ను తో స్కాన్ చేస్తే దీనిలోని AI, అది స్కిన్ కాన్సెరా కాదా అన్నది చెప్పేస్తుంది. అది ఎలాగంటే, ఈ AI కు కొన్ని వందల వేల స్పెక్ట్రోస్కోపి ఆధారిత స్కాన్ లు దాని ఫలితాలను చూపించగా దీనిలోని అల్గోరిథం దానిని అర్ధం చేసుకుని స్కిన్ కాన్సర్ లా కనిపిస్తున్న స్కాన్ లను గుర్తించేస్తుంది. అక్కడ నుండి తదుపరి వైద్య పరీక్షలు, సలహాలు అవసరం అవుతాయి అంటున్నారు Simmons. ఇది మార్కెట్ లోకి వస్తే, ఎవ్వరైనా తమకి తాము ఈ పరీక్ష చేసుకోవచ్చు అంటున్నారు Simmons. ఈ టెక్నాలజీ ని పేటెంట్ చేసారు. దీనిని 2011లో Boston University, మరియు University College of London లలో దీనిని అభివృద్ధి చేసారు. అప్పటి నుండి ఇది అభివృద్ధి చెందుతూనే ఉంది.

మొదట ఈ పరికరం, ఒక పెద్ద కంప్యూటర్ పరిమాణంలో ఉండేదట. ఆ పైన పరిశోధన చేయగా చేయగా ఇలా ఒక చిన్న పెన్ను పరిమాణానికి వచ్చిందని చెబుతున్నారు Simmons.

ఈ DermaSensor ప్రస్తుతం అమెరికా లో క్లినికల్ ట్రయల్స్ లో ఉంది, FDA అప్రూవల్ కూడా పొందిన తరువాతనే ఇది మార్కెట్లోకి వస్తుంది. దీనికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కానీ త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.