సరికొత్త సాంకేతిక విజ్ఞ్యానంతో మనకు వినోదానికి అంతు లేదు. స్మార్ట్ ఫోన్లో గేమింగ్ యాప్స్ పోయి గేమింగ్ కన్సోల్స్ అటు పైన VR హెడ్ సెట్ లు వచ్చేసాయి. ఇప్పుడు వాటన్నిటిని కాదని మీకు మరింత మెరుగైన నాణ్యమైన అనుభూతిని కలిగించేందుకు మీకు పర్సనల్ థియేటర్ సిస్టం అందుబాటులోకి వచ్చేసింది. అదే ఈ Avegant Glyph. ఇదేంటో, దీన్లో ఏముందో తెలుసుకుందామా.

Avegant అనే సంస్థ ఈ Glyph అనే హెడ్సెట్ ను రూపొందించింది. మన యొక్క మూవీ లేదా గేమింగ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఇది ఉద్దేశించబడింది. ఇది అన్ని స్మార్ట్ ఫోన్, tablet లకు పని చేస్తుంది. కాకపోతే దీనిలో HDMI పోర్ట్ ఉన్నందున వీటికి అమర్చుకోవడానికి HDMI అడాప్టర్ తప్పనిసరి. ఇక దీనిని ఇతర VR headset లానే కళ్ళకు కళ్ళజోడులా పెట్టుకోవాలి. అప్పుడు గేమ్, వీడియో లేదా సినిమా కావచ్చు మీకు థియేటర్ లో చూసిన అనుభూతి కలుగుతుంది అని ఈ సంస్థ చెబుతోంది. దీని ద్వారా మీరేం చూసినా దాని వల్ల ఇతరులకు ఇబ్బంది ఉండదు, అలాగే బయట ప్రపంచం వల్ల మీకు ఇబ్బంది ఉండదు. దీనిలో మరో ప్రయోజనం ఏంటంటే VR హెడ్సెట్ లాగ ఇది పూర్తిగా కళ్ళను మూసి ఉంచదు. మన చుట్టూ ఏం జరుగుతోందో తెలియడానికి అవకాశం ఉంటుంది.

ఇక ఈ హెడ్సెట్ లో రెండు కెమెరా లెన్స్ ఉన్నాయి. ఇది పెట్టుకుంటే మన కంటికి ఆ లెన్స్ మరింత దగ్గరగా ఉండడం తో సహజంగా మనకు థియేటర్ అనుభూతి కలగడానికి కారణమవుతుంది. ఇది micro mirror display తో తయారయింది. అంటే ఈ లెన్స్ లోపలి LED లైటు ద్వారా రెండు కోట్ల అతి చిన్న అద్దాల నుంచి కాంతి కంటి మీద పడుతుంది. తద్వారా ఎలాంటి డిస్ప్లే లేకుండానే మన ఫోన్ లేదా tablet మీద ఉన్న దృశ్యం మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇటువంటి పరిజ్ఞ్యానం గతంలోనే ఉన్నప్పటికీ వినియోగదారుల కోసం ఇటువంటి దానిని వినియోగించడం ఇదే మొదటి సారి. మున్ముందు ఇదే మరింత మెరుగై మనకు అందుబాటు లోకి రావచ్చు. పైగా ఈ పద్ధతి మనం సహజంగా మన కన్ను ఎలా ఎదుటి దృశ్యాన్ని గ్రహించే పద్ధతికి దగ్గరగా ఉండడం వల్ల మనకు కళ్ళకు అలసట తెలియదని అంటున్నారు దీని రూపకర్తలు.

సరే, ఇప్పటికే VR headset చూసిన వారికి ఉపయోగించిన వారికి ఇది కొత్త అనిపించదు కానీ, ఇతరులకు ఈ Glyph కొంచెం వింతగానే అనిపిస్తుంది. సరే, ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, tablet లు వచ్చాయి కదా మరి ఇదెందుకు అనుకుంటే, దానికీ సమాధానం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు దీని వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లభిస్తుంది, ఇతురులేవ్వరూ చూడలేని వినోద ప్రపంచంలోకి జారిపోవచ్చు. నిజమే కదా ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఆ ప్రయాణంలో దీనిని మించిన మరో వినోదం ఉండదు.

ఇక దీని బాటరీ సుమారు నాలుగు గంటలు ఏకధాటిగా పని చేస్తుంది. అంతే కాదు ఈ హెడ్సెట్ కూడా ఎంతో తేలిగ్గా ఉంది దీనిలోనే వాల్యూం, ఫోకస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక కెమెరా లెన్స్ కంటికి దగ్గరగా ఉండడం వల్ల ఎలాంటి వారికైనా దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది.

దీని ధర $699. ఇది కాస్త ఎక్కువైనా వినూత్నమైన పద్ధతుల్లో వినోదం కావాలి అనుకునే వారికి ఇది సరైనదేనని చెప్పాలి. ఇది ఇప్పటికే అమెజాన్ లాంచ్పాడ్ వంటి స్టోర్లో లభ్యo అవుతోంది. ప్రస్తుతం ఇది అమెరికన్ మార్కెట్లో లభ్యం అవుతోంది. ఇక మరిన్ని దేశాల్లో దీనిని విడుదల చేసేందుకు ఈ సంస్థ సిద్ధం అవుతోంది.

Courtesy