మనం తీసుకునే ఆహారం నుంచే మనకు శక్తి వస్తుంది. మన ఆహారపుటలవాట్లను బట్టే మన ఆరోగ్యం ఆధార పడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం తిన్నా పర్వాలేదు కానీ, ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆహార నియమం పాటించాల్సి ఉంటుంది. జ్వరం దగ్గర నుంచి రక్త పోటు(బీపి), చక్కెర వ్యాధి (డయాబెటిస్) నుంచి పెద్ద పెద్ద మొండి జబ్బుల దాకా ఖచ్చితమైన ఆహార నియమం పాటించాలి. నియమం అయితే ఉంటుంది కానీ దానిని అందరూ పాటించరు. తీరిగ్గా తినకూడనివి తినేసి ఆపైన వైద్యులు ఇలా ఎందుకు మీరేం తిన్నారు అని అడిగితే, అబ్బే మేము తినకూడనివి అసలు ముట్టలేదని మనలో చాలా మంది చెప్పడం మనకు అనుభవమే కదూ. సరే ఇంత వరకు అబద్ధం చెప్పవచ్చు కానీ భవిష్యత్తులో రాబోయే ఒక చిన్న వైద్య పరీక్ష మన కంటే ముందే మనమేం తిన్నామో చెప్పేస్తుంది.

ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్ (Imperial College of London) లోని Department of Medicine కు చెందిన రీసెర్చ్ అసోసియేట్ Isabel Garcia Perez చేసిన ఒక పరిశోధనలో ఒక కొత్త రకం మూత్ర పరీక్ష (Urine test) ద్వారా వ్యక్తుల ఆహారం ఎలాంటిదో తెలుసుకోవచ్చని అంటున్నారు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయిన తరువాత ఒక్కో ఆహార పదార్ధం తిన్నాక ఒక్కో ప్రత్యేకమైన రసాయన పదార్ధాలుగా (chemical compounds) మారుతుoదని ఆ రసాయనాలు మూత్రం లో విడుదల అవుతాయని, వాటిని గుర్తించగలిగితే వ్యక్తి ఆ పూట ఏం తిన్నాడో చెప్పవచ్చని Isabel అంటున్నారు.

ఇందుకోసం వీరు ఒక ప్రయోగం చేసారు. ఒక ల్యాబ్ లో 19 మంది వ్యక్తులను మూడు పూటలా నాలుగు రకాల ఆహారాన్ని తీసుకోమని (మాoసం, పళ్ళు, కూరగాయల నుంచి కొవ్వు అధికంగా ఉన్న ఆహారం వరకు) అలా తీసుకున్న తరువాత వారి నుంచి వారి మూత్రాన్ని సేకరించి కొన్ని రకాల రసాయనాలను గూర్చి పరీక్ష చేయగా అవి ఖచ్చితంగా వారు తిన్న ఆహారాన్ని సూచిoచాయని తెలిసింది. ఇలా మూడు రోజులు వరుసగా పరీక్షించగా ఈ మూత్ర పరీక్ష ద్వారా ఏ పూటకా పూట వారి ఆహారo ఏమిటో ఖచ్చితంగా తెలిసిందని అంటున్నారు. అంతే కాదు ఈ బృందం UK నుండి 225 మంది నుండి అలాగే డెన్మార్క్ లోని మరో 66 మంది వ్యక్తుల నుండి కూడా ఇదే పరీక్ష చేయగా ఖచ్చితంగా వారి ఆహారం ఏంటో తెలుసుకోగలిగామని Isabel అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఈ పరిశోధన తోలి దశలోనే ఉందని ఇది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పడుతుందని Isabel అంటున్నారు. ఈ పరిశోధనను జనవరి 12న జర్నల్ The Lancet Diabetes & Endocrinology లో ప్రచురించారు.

ఇటువంటి పరీక్షల ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చు. అంతే కాకుండా వీటిని బరువు తగ్గేందుకు, ఇంకా ఎన్నో రకాలుగా వైద్యంలో దీని వల్ల ఉపయోగం ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Courtesy