చక్కెర. దీనిని ఇష్టపడని వారు ఉండరు. పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి దాకా చక్కెర/పంచదార తో చేసిన పదార్ధాలను ఇష్టంగా తింటారు. ఇది ప్రత్యక్షంగా కొవ్వు పదార్ధం కాకపోయినా, దీనిని ఉపయోగించే పదార్ధాలలో విపరీతమైన కొవ్వు ఉంటుంది. ఈ చక్కెర తీయదనం మనల్ని ఆ కొవ్వు పదార్ధాల వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. అందుకే కాఫీ, టీ, శీతల పానీయాలు, కేకులు, చాక్లెట్లు ఇలా ఎన్నో తినేల చేస్తుంది. ఈ రుచిని అడ్డు పెట్టుకుని హెల్త్ డ్రింక్స్ అంటూ పాలల్లో కలుపుకొని తాగే పోడుల్లో సైతం గ్రాముకు పరిమితికి మించిన పంచదారను కలిపి అమ్మేస్తున్నారు. ఫలితంగా ఊబకాయం, డయాబెటిస్, శరీరం లో కొవ్వు పేరుకొనిపోవడం మొదలైన సమస్యలన్నీ. అలా అని పూర్తిగా పంచదారను మానేస్తే ఈ పదార్ధాలన్నీ తినగలిగేవిగా ఉండవు. ఇక ఆర్టిఫిషియల్ స్వీటనర్ సైతం ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది, ఇస్రాయిల్ కు చెందిన DouxMatok అనే సంస్థ. వారు చేసిన పరిశోధనల ఫలితంగా చక్కెర లాంటి ఒక పదార్ధాన్ని తయారు చేసారు. అదేంటో దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

Sugar_2

సంప్రదాయ పద్ధతి లో చెరుకు నుంచి తయారు చేసిన పంచదారకు బదులుగా, అంతే పరిమాణం లో చిన్న చిన్న ఆహార పదార్ధాలను ప్రకృతిలో సహజ సిద్ధంగా తీయనైన Sucrose, Glucose వంటి పదార్ధాలతో తాపడం చేస్తారు. అలా తయారైన చక్కెర కు మనం నిత్యం ఉపయోగిస్తున్న చక్కెర కంటే రెట్టింపు తీయదనం ఉంటుంది. అందువల్ల సహజంగా మనం రెండు స్పూన్ల పంచదార వేసుకునేటప్పుడు, ఈ ఉత్పత్తి తో కేవలం ఒక్క స్పూను పంచదార మాత్రమే సరిపోతుంది. ఆ విధంగా మనం తక్కువ చక్కెరను ఉపయోగించిన వారమవుతాం. అలాగని దీని ధర ఏమి ఎక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే మన చక్కెర కంటే దీని ధర చాలా తక్కువ. ఇప్పటికే దీనిని కేకుల్లో, స్వీట్లల్లో ఉపయోగిస్తున్నారు. తక్కువ కేలరీలు, తక్కువ ధర, ఎటువంటి హానికరమైన పదార్ధాలు ఇందులో కలవకపోవడం ఇందుకు కారణం.

Sugar_1

ఇటువంటి ఉత్పత్తి ఆహార పదార్ధాల పరిశ్రమలో మొదటిది అని చెప్పచ్చు. దీనిని పరీక్షించినప్పుడు సంప్రదాయ చక్కెర కు, దీనికి ఎటువంటి తేడా లేకపోవడం విశేషం. దీనితో చక్కెర మోతాదు సగానికి సగం తగ్గిపోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతమున్న జీవన శైలిలో, డయాబెటిస్ రాజ్య మేలుతున్న ఈ రోజుల్లో ప్రపంచ దేశాలతో పాటు మనకు ఈ ఉత్పత్తి అవసరం ఎంతో ఉంది.

Courtesy