భద్రతను పటిష్టం చేసే ఫింగర్ ఐడిలు

దేశ భద్రత, ప్రజల రక్షణ దృష్ట్యా ఎంతో అవసరం. ఆ మాటకొస్తే దేశ సరిహద్దు రక్షణే కాదు ఒక్కో రాష్ట్రంలోని ప్రజల రక్షణ కూడా దేశ సమగ్రతకు ఎంతో అవసరం. మన దేశానికి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం ఇలా ఏదైనా ముఖ్యమైన రోజుల్లో ప్రధాన నగరాలకు ఉగ్రవాదుల నుంచీ ముప్పు పొంచి ఉంటుంది. అప్పుడు కట్టు దిట్టమైన ఏర్పాట్లు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య బయట పడిన డేవిడ్ హేడ్లే (David Headley) వాంగ్మూలం దృష్ట్యా ముంబై పేలుళ్ళ కొరకు వారు ఎన్ని ప్రయత్నాలు చేసారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలా ఎక్కడెక్కడ ఎంత మంది రెక్కి నిర్వహించారో తలచుకుంటే భయం వేస్తుంది కూడా కదూ. మరి వీరిని పట్టుకోవడం కొంచెం కష్టమే. ఎవరో ఒకరి పేరున ముసుగులో తిరిగే వీరు దొరికినట్టే దొరికి జారిపోవచ్చు కూడా. మరి దీనికి ఏమిటి పరిష్కారం. అనుమానాస్పద వ్యక్తులు చెబుతున్న వివరాలు (ID) నిజమో కాదో తెలుసుకోవడానికి వీరిని జైలులో పెట్టి, వేలిముద్రలు సేకరించి, విచారిస్తే కానీ నిజం బయట పడదు. ఇందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. తీవ్రవాదులే కాదు, దొంగలు, దోపిడీదారులు మొదలైన వారు తప్పించుకోవడానికి చట్టంలోని ఈ లొసుగు బాగా ఉపయోగపడుతుంది. మరి దీనికి పరిష్కారం నార్త్ కెరొలిన లో ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి.

అమెరికా లోని North Carolina రాష్ట్రం లోని Eden ప్రాంతం లో పోలీసులు సాంకేతికత సహాయంతో ఒక కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే ఈ Mobile Fingerprint Identification device. దీనిని ID Networks, Inc., అనే సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ అక్కడి పోలీసు వ్యవస్థకు అనుబంధంగా software solutions ను అందిస్తుంది. అందులో భాగంగానే ఈ సంస్థ ఈ పరికరాన్ని తయారు చేసింది. ఇది చూడడానికి మన చేతిలో పట్టేంత చిన్న పరికరం. దీనిలో అనుమానాస్పద వ్యక్తుల బొటన వేలిని ఈ పరికరంలో వత్తితే ఆ వేలి ముద్రను ఈ పరికరం సేకరించి ఈ పరికరానికి బ్లూటూత్ ద్వారా అనుసంధానం చేయబడిన పోలీసు లాప్టాప్ కు చేరవేస్తుంది. అక్కడి నుండి సర్వర్ కు కనెక్ట్ చేయబడి ఇది నేరస్తుల వేలిముద్రలలో ఈ వ్యక్తి ఉన్నదీ లేనిదీ చెప్పేస్తుంది. ఆ విధంగా ఎంతో సమయం పట్టే పని చిటికెలో అయిపోతుంది. తప్పుడు వివరాలు చెప్పే వారు, అనుమానాస్పద వ్యక్తులను కేవలం ఈ పరికరం ద్వారా సులువుగా పట్టుకోవచ్చు.

అయితే ఇది భద్రత దృష్ట్యా కేవలం ఏ ఒక్క దేశానికో ప్రాంతానికి పనికొచ్చే పరికరం కాదు. ఏ దేశం లోనైనా ఉపయోగపడుతుంది. అందులోనూ ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న మన దేశానికి ఇటువంటి పరికరాలు మరింతగా ఉపయోగపడతాయి. ఇటువంటి పరికరాలను మన దేశంలో ప్రతీ రాష్ట్రం లో అన్ని ప్రధాన నగరాల్లో ఉపయోగిస్తే తీవ్రవాదుల కుట్రలే కాదు ప్రజలను దోచుకునే దొంగలు, దోపిడీదారుల నుంచి కూడా ప్రజలకు రక్షణ లభిస్తుంది.

Courtesy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *