15 ఏళ్ల కుర్రాడు హఠత్తు గా వచ్చే గుండె పోటును ముందుగానే కనిపెట్టే పరికరాన్ని తయారు చేసాడు

జీవన విధానంలో, ఆహారపుటలవాట్లు మరియు వృత్తి జీవితంలో ఒత్తిడి ఇలా ఈ మూడూ మనుషుల్లో గుండె పోటుకు దారి తీస్తున్నాయి. ఈ గుండె పోటు వచ్చే ముందు కూడా ఎలాంటి లక్షణాలు కనిపించవు. మనుషులు ఆరోగ్యంగానే కనిపిస్తుంటారు, కానీ ఉన్నట్టుండి కూలిపోతారు. అదృష్టం బావుంటే సకాలంలో వైద్యం అంది బయటపడతారు, లేదంటే, ఇక అంతే సంగతులు. ఇలా ఒక్కరు కాదు కొన్ని కోట్ల మందిని మింగేస్తోంది ఈ మహమ్మారి. గుండె పోటు వచ్చినప్పుడు, కనీసం ప్రాధమిక చికిత్స అందించడానికి కూడా, అది గుండె పోటు అని కనిపెట్టడం కూడా పక్కవారికి కష్టమే. ఇలాంటి తరుణంలో మన దేశంలోని తమిళనాడు కు చెందిన ఒక 15 ఏళ్ల కుర్రాడు, ఆకాష్ మనోజ్, ఒక ఈ గుండె పోటును ముందుగానే కనుక్కునేందుకు చాలా సులభమైన పద్ధతిలో ఒక పరికరాన్ని కనిపెట్టాడు.

ఆకాష్ మనోజ్, తాత గారు కూడా 2015 లో ఇలాగే హఠత్తుగా గుండె పోటు తో చనిపోయారు. చూడడానికి ఆరోగ్యంగా కనిపించే తన తాత గారు ఇలా ఉన్నట్టుండి అలా కుప్పకూలిపోవడం, ఆ అబ్బాయిలో ఆలోచనను రేకెత్తించింది. అప్పటికే బాల మేధావి వంటి మనోజ్, మెడికల్ జర్నల్స్ చదివి కార్డియాలజీ గురించి తెలుస్కున్నాడు. దీనికి పరిష్కారం కనుగొనాలని ఒక ఏడాది పాటు శ్రమించి ఒక పరికరాన్ని కనుగొన్నాడు. అది కూడా ఒంటికి ఎలాంటి సూది గుచ్చకుండానే గుండె పోటును కనిపెట్టవచ్చు. ఈ పద్ధతిని “Non-invasive Self Diagnosis of Heart attacks” అంటారు. ఈ పద్ధతిలో – రక్తంలో ఉండే FABP3 అనే ప్రోటీన్ ను కనిపెట్టగలిగితే గుండె పోటు వస్తుందని నిర్ధారించవచ్చు అన్న మాట. ఈ FABP3 ప్రోటీన్ అనే బయోమార్కర్, రక్తంలో చాలా చాలా తక్కువ పాళ్ళల్లో ఉంటుంది. కాకపోతే ఇది నెగటివ్ ఛార్జ్ కలిగి ఉండడం వల్ల ఇది పాజిటివ్ ఛార్జ్ ను ఆకర్షిస్తుంది. ఒక ఎలక్ట్రోడ్ patch ను ఒంటి మీద వేసుకోవాలి, ఆ పైన దానిని ఒక NaCl సొల్యూషన్ కు కనెక్ట్ చేసారు. ఇప్పుడు మన శరీరంలోని రక్తంలో FABP3 ప్రోటీన్ ఉంటే, అది ఈ patch/ఎలక్ట్రోడ్ కు అతుక్కుంటుంది. ఆ పైన ఈ సొల్యూషన్ కు voltage అప్లై చేస్తే విద్యుత్తు ఉత్పన్నమవుతుంది. అటు పైన ఒక సెన్సర్ ను ఉపయోగించి, UV quantification ద్వారా ఎంత FABP3 ఉందో కనిపెట్టవచ్చు. అంతే, ఈ పద్ధతిలో ఎవరికి వారు తమకు గుండె పోటు వచ్చే అవకాశం ఉందా లేదా అని పరీక్షించుకోవచ్చు. ఇది తెలిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

అయితే దీనిని పూర్తి స్థాయిలో ఒక పరికరంగా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరొక ఏడాదిన్నర సమయం పడుతుంది అంటున్నాడు మనోజ్. ఇందుకోసం AIIMS Delhi లోని వైద్యులతో కలిసి పని చేస్తున్నాడు. అంతేనా ఇంతటి సులభమైన పద్ధతిలో ఇలాంటి పరికరాన్ని తయారు చేసినందుకు మన ప్రెసిడెంట్ “Innovative Scholars In-Residence Program” కింద ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ఉన్నాడు.

చిన్న వాడైనా ఇంతటి లోకోపకారం చేసే పరికరాన్ని కనిపెట్టి అభివృద్ధి చేస్తున్నoదుకు ఇతన్ని ప్రశంసిoచకుండా ఉండలేం కదూ.

Courtesy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *