ఈనాటి స్మార్ట్ ప్రపంచంలో మనం ఊహించని విధంగా వస్తువులతో మాయాజాలం చేస్తున్నారు. దాని వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయి. స్మార్ట్ హోం అప్లికేషన్స్ ఎన్నో మార్కెట్లోకి వచ్చేసాయి, దాని వల్ల మనుష్య శ్రమ అంతకంతకూ తగ్గిపోతోంది. ఇప్పుడు అలాంటి ఒక విషయాన్ని ప్రస్తావించుకుందాం. సాధారణంగా ఇంటికి వేసిన తాళం తీయాలి అంటే తాళంచెవి మన దగ్గర ఉండాలి. ఇలా ఇళ్ళు, కార్యాలయం, కారు ఇలా ఎన్నెన్నో తాళాలు పెట్టుకుని తిరగాలి. కానీ అవేమీ అవసరం లేకుండా మీరు వేసుకున్న బట్టలే మీ ఇంటికి పాస్వర్డ్ అయితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఇంకేం పరిశోధించి దానిని నిజం చేసేసారు University of Washington కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు. వివరాల్లోకి వెళ్తే..

ఒక రకమైన దారం (ఎంబ్రాయిడరీ దారం)తో తయారు చేసిన బట్టకు ఏదైనా డేటాను సేవ్ చేసుకోగల సామర్ధ్యం ఉంటుందట. దీనికి ఉండే విద్యుత్, అయస్కాంత శక్తి ద్వారా దీనిలో ఎలక్ట్రానిక్స్ మాదిరి డేటా (నంబర్స్ లేదా పాటర్న్) ను గుర్తిస్తుంది. ఈ డేటాను ఒక మాగ్నేటోమీటర్ గుర్తించగలదు అంటున్నారు ఈ UW బృందానికి నేతృత్వం వహించిన శ్యాం గొల్లకోట. అంటే ఐడి కార్డు వెనుక ఉండే మాగ్నెటిక్ డేటా ను చదవడమే అన్లాక్ చేయడం. అదే డేటా ను కార్డుకు బదులు బట్టల్లో చేయచ్చు అని చెబుతున్నారు. ఈ మాగ్నెటిక్ డేటా ను చదవడానికి కావాల్సిన మాగ్నేటోమీటర్ ప్రతీ ఫోన్ లో ఉంటుంది.

దీనిని రుజువు చేయడానికి ఒక ప్రయోగం చేసారు. ఈ conductive thread తో తయారైన ఒక చిన్న గుడ్డ ముక్కను తీసుకుని దానిలో ఒక పాస్వర్డ్ లాంటిది రాసారు. ఈ పాస్వర్డ్ ఒక ఎలక్ట్రానిక్ లాక్ కలిగిన డోర్ ను తెరవాలన్న మాట. ఇప్పుడు ఈ చిన్న పాచ్ లోని డేటా లేదా పాస్వర్డ్ ను మగ్నేటోమీటర్ చదవగలిగింది. అంటే మన ఫోన్ ద్వారా ఈ చిన్న గుడ్డ ముక్కను స్వైప్ చేసినట్టు చేస్తే చాలు మరి ఎలాంటి అదనపు ఎలక్ట్రానిక్ పానెల్ అవసరం లేకుండా డోర్ తెరుచుకోబడింది. అంతే కాదు ఈ conductive thread తో తయారు చేసిన ఒక రిస్ట్ బ్యాండ్, టై, బెల్ట్ మొదలైన వాటిలోని data/పాస్వర్డ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ తో స్వైప్ చేసి ఫలానా వస్తువులను తెరవగలిగారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫాబ్రిక్ లు అభివృద్ధి చేస్తన్నా వాటిలో కొన్ని సెన్సర్స్, ఎలక్ట్రానిక్స్ ఉండడం జరుగుతుంది. కానీ ఈ పద్ధతిలో కేవలం ఒక ప్రత్యేకమైన దారం తప్ప మరీది లేకపోవడం విశేషం. ఈ పాచ్ కలిగిన వస్త్రాన్ని ఎన్నిమార్లు వాషింగ్ మెషిన్ లో వేసి ఉతికినా ఈ పాచ్ ఇంకా పని చేస్తూనే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఈ పాచ్ లోని మాగ్నెటిక్ signal వీక్ అయినప్పుడు మళ్ళీ తేలిగ్గా దానిని రీప్రోగ్రాం చేసుకోవచ్చు అంటున్నారు శ్యాం గొల్లకోట.

అంటే మనం నిత్యం ఉపయోగించే ఐడి కార్డ్లకు బదులు ఈ చిన్న పాచ్ అదే స్వైపింగ్ ట్యాగ్ లా పనిచేస్తుందన్న మాట. అయితే దీనిని మనం రోజు వేసుకునే వస్త్రాలలో భాగంగా ఏ టై, బెల్ట్ లోనో పెట్టుకుంటే ఐడి ట్యాగ్ లేదా పాస్వర్డ్ మర్చిపోయామన్న భయం ఉండదు.